ఘోర ప్రమాదం.. మంట‌ల్లో బ‌స్సు.. 12 మంది స‌జీవ ద‌హ‌నం

Nashik bus fire death toll 12 Dead Several Injured.మ‌హారాష్ట్ర‌లో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 Oct 2022 8:25 AM IST
ఘోర ప్రమాదం.. మంట‌ల్లో బ‌స్సు.. 12 మంది స‌జీవ ద‌హ‌నం

మ‌హారాష్ట్ర‌లో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. ఓ ప్రైవేటు బ‌స్సులో మంట‌లు చెల‌రేగి 12 మంది స‌జీవ ద‌హ‌నం అయ్యారు. మ‌రో 30 మందికి పైగా తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

వివ‌రాలు ఇలా ఉన్నాయి. యవత్మాలి నుంచి ముంబై వెలుతున్న ఓ ప్రైవేటు ల‌గ్జ‌రీ బ‌స్సు శ‌నివారం తెల్ల‌వారుజామున 5 గంట‌ల స‌మ‌యంలో నాసిక్-ఔరంగాబాద్ హైవేపై నందూర్నాక వ‌ద్ద ఓ ట్ర‌క్క‌ను ఢీ కొట్టింది. ప్ర‌యాణీకులు ఆ స‌య‌మంలో గాఢ నిద్ర‌లో ఉన్నారు. ప్ర‌మాద ధాటికి వారు ఉలిక్కి ప‌డి నిద్ర లేచారు. అయితే.. ప్ర‌మాదం కార‌ణంగా డీజిల్ ట్యాంక‌ర్ ప‌గిలి మంట‌లు చెల‌రేగాయి. క్ష‌ణాల్లోనే మంట‌లు బ‌స్సు మొత్తం వ్యాపించాయి. కిటీకి అద్దాలు ప‌గ‌ల కొట్టి బ‌య‌ట‌కు దూకేసిన‌ట్లు ప‌లువురు ప్ర‌యాణీకులు తెలిపారు.

స‌మాచారం అందుకున్న వెంట‌నే అధికారులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. నాలుగు ఫైరింజన్లతో అగ్నిమాప‌క సిబ్బంది శ్ర‌మించి మంట‌ల‌ను అదుపులోకి తీసుకువ‌చ్చారు. ఈ ప్ర‌మాదంలో 12 మంది స‌జీవ ద‌హ‌నం అయ్యార‌ని, మ‌రో 30 మంది గాయ‌ప‌డిన‌ట్లు పోలీసులు తెలిపారు. క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించిన‌ట్లు తెలిపారు. మృత‌దేహాలు గుర్తుప‌ట్ట‌లేని విధంగా కాలిపోయిన‌ట్లు చెప్పారు. కాగా.. ప్ర‌మాద స‌మ‌యంలో బ‌స్సులో ఎంత మంది ప్ర‌యాణీస్తున్నారు అనే దానిపై ఖ‌చ్చిత‌మైన స‌మాచారం లేద‌ని తెలిపారు.

చికిత్స పొందుతున్న వారిలో ప‌లువురి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు వైద్యులు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంది.

Next Story