మిస్టరీ డెత్‌: లండన్ వెళ్లాల్సిన యువకుడు ఉరివేసుకున్నాడు

Mystery Death.. Youth committed suicide by hanging in NTR district. ఎన్టీఆర్ జిల్లా నందిగామ ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది. ఉన్నత చదువుల కోసం

By అంజి  Published on  12 Jan 2023 3:52 PM IST
మిస్టరీ డెత్‌: లండన్ వెళ్లాల్సిన యువకుడు ఉరివేసుకున్నాడు

ఎన్టీఆర్ జిల్లా నందిగామ ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది. ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లాల్సిన ఓ యువకుడు చెట్టుకు ఉరివేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నందిగామ శివారు హనుమంతులపాలెంకు చెందిన గాడిపర్తి వెంకటనారాయణ కొంతకాలంగా నందిగామ పట్టణంలో నివాసం ఉంటున్నాడు. వెంకటనారాయణ, రాణి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు గోపీకృష్ణ లండన్‌లో ఉన్నత చదువులు చదువుతున్నాడు.

రెండో కుమారుడు గాడిపర్తి శివకృష్ణ (24) గతేడాది బీటెక్‌ పూర్తి చేసి ఉన్నత చదువుల కోసం బుధవారం తెల్లవారుజామున లండన్‌ వెళ్లేందుకు హైదరాబాద్‌ వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం 3:30 గంటల ప్రాంతంలో శివకృష్ణ తన స్నేహితులతో కలిసి వస్తానని చెప్పి ద్విచక్రవాహనంపై ఇంటి నుంచి బయలుదేరాడు. సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాద్ విమానాశ్రయానికి వెళ్లేందుకు కుటుంబ సభ్యులు అంతా సిద్ధం చేసుకున్నారు. శివకృష్ణ బయటకు వెళ్లి ఎంతసేపటికి తిరిగి రాలేదు.

దీనికి తోడు ఫోన్ స్విచ్ఛాఫ్ కావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెంది స్నేహితులను అడిగారు. అయితే అతడి ఆచూకీ తెలియరాలేదు. బుధవారం ఉదయం నవాబుపేట సమీపంలోని పొలాల్లో చెట్టుకు వేలాడుతున్న యువకుడి మృతదేహాన్ని గుర్తించిన రైతులు పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే కొడుకు కోసం వెతుకుతున్న వెంకటనారాయణ కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతుడు శివకృష్ణగా గుర్తించారు. వత్సవాయి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Next Story