తల్లి, చెల్లి, తమ్ముడిని చంపేసిన కిరాతకుడు.. ఎందుకు చేశాడంటే
Murder In Kadapa District. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలో దారుణం జరిగింది. కన్నతల్లితోపాటు చెల్లి, సోదరుడిని కూడా హతమార్చాడు ఓ రాక్షసుడు.
By Medi Samrat Published on 26 April 2021 8:21 AM GMT
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలో దారుణం జరిగింది. కన్నతల్లితోపాటు చెల్లి, సోదరుడిని కూడా హతమార్చాడు ఓ రాక్షసుడు. ప్రొద్దుటూరులోని హైదర్ ఖాన్ వీధికి చెందిన కరీముల్లా అనే వ్యక్తి తల్లి, చెల్లి, తమ్ముడిని కిరాతకంగా చంపేశాక స్థానిక పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. హంతకుడు ఇచ్చిన సమాచారంతో ఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు అక్కడ మృతదేహాలు పడి ఉండడాన్ని గమనించారు. అప్పటికే అందరూ మరణించినట్లు తెలుస్తోంది. మృతిచెందిన వారిని గుల్జార్ బేగం(50), కరీమున్నీసా (21), మహమ్మద్ రఫి (25)గా పోలీసులు గుర్తించారు. ముగ్గురి మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాలతోనే వారిని హత్య చేసినట్లు తెలుస్తోంది.
కరిముళ్ల ప్రవర్తన కొద్దిరోజులుగా సరిగ్గా లేదని పోలీసులు చెబుతున్నారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కరీముల్లా తన తల్లి, చెల్లి, తమ్ముడిని రోకలి బండతో మోదీ దారుణంగా ఈ హత్యలకు పాల్పడ్డాడు. అనంతరం నేరుగా వెళ్లి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. ఒక వివాదం విషయంలో తనకు కుటుంబ సభ్యులు సహకరించడం లేదనే కారణంతోనే వారిని హతమార్చినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలోని వారంతా షాక్ కు గురయ్యారు.