చిత్తూరు జిల్లాలో దారుణ హత్య చోటు చేసుకుంది. తన కుమార్తెతో చనువుగా ఉన్న యువకుడిని యువతి తండ్రి దారుణంగా హత్య చేశాడు. మొదట ఆ యువకుడిని కొట్టడంతో అతడి ప్రాణం పోయింది. బావిలో మృతదేహాన్ని పడేశాడు. కానీ తేలే అవకాశం ఉండడంతో మృతదేహాన్ని బావిలో నుండి బయటకు తీసి.. ముక్కలు ముక్కలుగా నరికి ఒక్కో భాగాన్ని ఒక్కో చోట.. తన పొలంలో పాతి పెట్టాడు. సదరు యువకుడు కనిపించకపోవడంతో పోలీసులు విచారణ మొదలు పెట్టారు. చివరికి ఆ యువకుడి లవ్ స్టోరీ గురించి తెలిసి ఆరా తీయగా ఈ ఘటన మొత్తం బయటకు వచ్చింది.

చిత్తూరు జిల్లా పలమనేరు మండలం పెంగరగుంటలో ఈ ఘటన చోటు చేసుకొంది. ఓ యువతిని ప్రేమించినందుకు ధనశేఖర్ అనే యువకుడిని యువతి తండ్రి బాబు హత్య చేశాడు. శుక్రవారం నాడు బాబును పోలీసులు అరెస్ట్ చేశారు. నాలుగు రోజుల కిందట ధన శేఖర్ ను హత్య చేశానని పోలీసుల ముందు బాబు ఒప్పుకున్నారు. తన కూతురితో ధనశేఖర్ ఏకాంతంగా ఉండగా చూసి అతడిని చితకబాదానని.. అలా దెబ్బలకే ధనశేఖర్ మృతి చెందినట్టుగా నిందితుడు నిర్ధారించుకున్నారు. మృతదేహాన్ని బావిలో వేసినట్టుగా చెప్పారు. మృతదేహం నీటిలో తేలితే అందరికీ తెలిసే అవకాశం ఉందని భావించి.. బావి నుండి శవాన్ని తీసి ముక్కలు ముక్కలుగా నరికి తన పొలంలోనే ఆ శరీర భాగాలను పూడ్చిపెట్టినట్టుగా పోలీసులకు బాబు వివరించాడు. మరీ ఇంత కిరాతకంగా ప్రవర్తిస్తాడని పోలీసులు కూడా ఊహించలేదు. బాబు ఒక్కడే ఈ దారుణానికి పాల్పడ్డాడా.. లేక అతడికి ఎవరైనా సహకరించారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ధనశేఖర్ ను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని మృతుడి కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు.


M.S.R

నేను M.S.R., న్యూస్‌మీట‌ర్‌లో కంట్రిబ్యూట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నాను. గ‌తంలో కహానియా, చిత్రం భళారే, న్యూసు, పబ్లిక్ టీవీ తెలుగు త‌దిత‌ర వార్త సంస్థ‌ల‌లో జ‌ర్న‌లిస్టుగా విధులు నిర్వ‌ర్తించాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.

Next Story