పిల్లలను అమ్మేసే సిండికేట్.. తెలుగు రాష్ట్రాల పిల్లలు కూడా..
పిల్లలను అమ్మేస్తూ, ఎన్నో అక్రమాలకు పాలాడుతున్న ముగ్గురు మహిళలను ముంబై పోలీసులు అరెస్టు చేశారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 1 May 2024 7:15 AM GMTపిల్లలను అమ్మేసే సిండికేట్.. తెలుగు రాష్ట్రాల పిల్లలు కూడా..
పిల్లలను అమ్మేస్తూ, ఎన్నో అక్రమాలకు పాలాడుతున్న ముగ్గురు మహిళలను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. అంతర్-రాష్ట్ర పిల్లల విక్రయ రాకెట్‌ను ముంబై పోలీసులు బట్టబయలు చేశారు. అహ్మద్‌నగర్, హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు పిల్లలను రక్షించగలిగామని ముంబై పోలీసు అధికారి తెలిపారు. క్రైమ్ బ్రాంచ్ ఆపరేషన్ లో ఈ రాకెట్ తో సంబంధం ఉన్న మొత్తం 10 మంది వ్యక్తులను అరెస్టు చేసింది. వారి బారి నుండి నలుగురు పిల్లలను విజయవంతంగా రక్షించినట్లు అధికారి ధృవీకరించారు. "హైదరాబాద్‌కు చెందిన ఎనిమిది నెలల బాలికతో పాటు అహ్మద్‌నగర్‌లోని అకోల్ నుండి ఏడాదిన్నర వయస్సు గల బాలుడు విముక్తి పొందాడు" అని అధికారి వివరించారు. అరెస్టు చేసిన ముగ్గురిని తొమ్మిది రోజుల పోలీసు కస్టడీకి పంపారు. అయితే విశాఖపట్నంలో నలుగురు మహిళలను క్రైమ్ బ్రాంచ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ యూనిట్ అదుపులోకి తీసుకోవడంతో మరిన్ని వివరాలు బయటకు వచ్చాయి. ఈ గ్యాంగ్ లోని స్త్రీలు.. సంతానోత్పత్తికి సంబంధించి మధ్యవర్తిత్వంలో కూడా నిమగ్నమై ఉన్నారు.
ఆదివారం నాడు ఓ డాక్టర్‌తో పాటు మరో ఆరుగురిని అరెస్టు చేసిన నేపథ్యంలో తాజాగా ఈ విషయం వెల్లడైంది. పసిపిల్లలు మరియు పసిబిడ్డల అక్రమ రవాణాలో వారి ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. తెలంగాణలోని హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలలో ఈ రాకెట్ కు లింక్స్ ఉన్నాయి. "ఈ రాకెట్ సభ్యులు కనీసం 14 మంది శిశువులు, పిల్లలను ముంబై నుండి హైదరాబాద్‌కు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలో విక్రయించినట్లు మా దర్యాప్తులో కనుగొన్నాం. సిండికేట్ సెప్టెంబర్ 2022 నుండి పనిచేస్తోంది" అని పోలీసులు చెప్పారు. ఒక్కో చిన్నారికి రూ.80 వేల నుంచి రూ. 4 లక్షల వరకు సిండికేట్ వసూలు చేయగా.. వారి తల్లిదండ్రులకు రూ.30 వేల నుంచి రూ.60 వేల వరకు అందజేస్తున్నట్లు అధికారులు తెలిపారు.