'కంపెనీ పనిమీద విదేశాలకు వెళ్తున్నాను. ఇల్లు, నువ్వు జాగ్రత్త. భయపడకు నేను త్వరగానే వస్తా' అంటూ భార్యకు ఎన్నో జాగ్రత్తలు చెప్పి ముంబైకి చెందిన ఓ ఇంజినీర్ తన ప్రియురాలితో కలిసి మాల్దీవులకు వెళ్లాడు. అయితే ఈ విషయం బయటపడకుండా ఉండేందుకు పాస్‌పోర్టులో పేజీలు చించేశాడు. ఆ తర్వాత ఎంచక్కా విమానం ఎక్కి ముంబైలో ల్యాండ్ అయ్యాడు. అయితే ఆ వ్యక్తి పాస్‌పోర్టులోని పేజీలు చించినందుకు.. ప్రస్తుతం జైల్లో ఊచలు లెక్క పెట్టుకుంటున్నాడు.
ముంబైకి చెందిన ఓ ఇంజినీర్ మల్టీ నేషనల్ కంపెనీలో పనిచేస్తున్నాడు. కంపెనీ పనిపై అబ్రాడ్‌కు వెళ్తున్నట్టు భార్యకు చెప్పి తన ప్రియురాలితో కలిసి మాల్దీవులకు వెళ్లాడు. అయితే విదేశాలకు వెళ్లిన భర్తకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో భార్యకు అనుమానం మొదలైంది. పలుసార్లు వాట్సాప్ కాల్స్ కూడా చేసింది. అయినా అదే పరిస్థితి. చివరికి ఆ వ్యక్తి టూర్‌ను కుదించుకుని తిరుగు ప్రయాణం అయ్యాడు. అదే సమయంలో భార్యకు అనుమానం రాకుండా ఉండేందుకు పాస్‌పోర్టులోని పేజీలను చించేశాడు. విమానంలో ముంబైకి చేరుకున్న తర్వాత అతడికి అసలు కష్టాలు మొదలయ్యాయి.
ఇంజినీర్ పాస్‌పోర్టులో కొన్ని పేజీలు చించివేసినట్లు ఇమ్మిగ్రేషన్ అధికారులు అనుమానించారు. అడిగిన ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో వారు అతడిని పాస్‌పోర్టు దుర్వినియోగం కింద పోలీసులకు అప్పగించారు. దీంతో మోసం, ఫోర్జరీ కింద అతడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అయితే పాస్‌పోర్ట్ బుక్‌లో పేజీలు చించివేయడం నేరమన్న సంగతి తెలియక, భార్య నుంచి తప్పించుకునేందుకు అలా చేసినట్లు అతడు చెప్పాడని పోలీసులు తెలిపారు.