హాస్టల్‌లో యువతిపై అత్యాచారం, హత్య.. అనుమానితుడు మృతి
ముంబైలోని మెరైన్ డ్రైవ్ ఏరియాలోని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న హాస్టల్ గదిలో 19 ఏళ్ల కాలేజీ యువతి మృతదేహం
By అంజి Published on 7 Jun 2023 9:45 AM ISTహాస్టల్‌లో యువతిపై అత్యాచారం, హత్య.. అనుమానితుడు మృతి
ముంబైలోని మెరైన్ డ్రైవ్ ఏరియాలోని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న హాస్టల్ గదిలో 19 ఏళ్ల కాలేజీ యువతి మృతదేహం కనిపించింది. ఆమెను రేప్ చేసి, హత్య చేశారని ముంబై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఓం ప్రకాష్ కనౌజియా అనే 30 ఏళ్ల నిందితుడు పరారీలో ఉన్నాడు. ఆ తర్వాత అతడు శవమై కనిపించాడని పోలీసులు తెలిపారు. నిందితుడు దక్షిణ ముంబైలోని పోలీస్ జింఖానా సమీపంలో ఉన్న సావిత్రి ఫూలే మహిళా హాస్టల్‌లో గార్డుగా పనిచేస్తున్నాడు. ఈ కేసుకు సంబంధించి మెరైన్ డ్రైవ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. మృతి చెందిన కళాశాల విద్యార్థినిపై లైంగిక దాడి జరిగినట్లు అనుమానిస్తున్నారు. శవపరీక్ష నివేదిక వచ్చిన తర్వాతే దీనిపై స్పష్టమైన సమాచారం వస్తుందని ఓ అధికారి తెలిపారు.
మహారాష్ట్రలోని విదర్భకు చెందిన 19 ఏళ్ల యువతి కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి ఆమె జాడ తెలియలేదు. నాలుగో అంతస్తులోని ఆమె హాస్టల్ గదికి బయటి నుంచి తాళం వేసి ఉండటంతో అందరూ ఆమె కోసం పలు ప్రాంతాల్లో వెతకడం ప్రారంభించారు. గదిలోకి ప్రవేశించిన పోలీసు బృందం బాధితురాలు కింద పడి ఉండడాన్ని గమనించారు. ఆమె మెడకు చున్నీ బిగించి ఉండడాన్ని గుర్తించారు.. అప్పటికే ఆమె చనిపోయి పడి ఉంది. అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. హాస్టల్‌లో పనిచేస్తున్న వ్యక్తి ఈ ఘటన జరిగినప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. ఈ విషయంపై విచారణ జరుపుతున్నామని అదనపు కమిషనర్ అభినవ్ దేశ్‌ముఖ్ తెలిపారు నిందితుడిని పట్టుకోవడానికి పోలీసులు వేట ప్రారంభించారు.
నిందితులను పట్టుకునేందుకు అదనపు కమిషనర్ దేశ్‌ముఖ్, మెరైన్ డ్రైవ్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ నీలేష్ బగుల్ నేతృత్వంలోని ఇతర అధికారులతో బృందాన్ని ఏర్పాటు చేశారు. మంగళవారం సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో సమీపంలోని రైల్వే స్టేషన్‌లో అనుమానితుడు మృతి చెందినట్లు సమాచారం అందింది. ప్రాథమిక విచారణ ప్రకారం చర్చ్‌గేట్ స్టేషన్ నుండి వస్తున్న రైలు ఢీకొనడంతో అతను మరణించాడు. అనంతరం అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీటీ ఆస్పత్రికి తరలించారు.