హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. సొంత తల్లే తన రెండో భర్తతో కలిసి నాలుగేళ్ల కూతురికి చిత్రహింసలు పెట్టింది. నాలుగేళ్ల కూతురి శరీరంపై కాలిన గాయాలు, ఇతర గాయాలను కలిగించి హింసించిన మహిళను, ఆమె రెండవ భర్తను మియాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. హఫీజ్‌పేటకు చెందిన షాబా నజ్వీమ్ (25)గా గుర్తించబడిన నిందితురాలు.. గతంలో తాజుద్దీన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఈ దంపతులకు రెండు, నాలుగు సంవత్సరాల వయస్సు గల ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విడాకుల తర్వాత, పెద్ద కుమార్తె.. తల్లి నజ్వీమ్‌తో నివసిస్తుందని మియాపూర్ పోలీసు అధికారి తెలిపారు.
"సుమారు రెండు నెలల క్రితం, నజ్వీమ్ జోగిపేటకు చెందిన ఆటో డ్రైవర్ ఎండీ జావేద్‌ను వివాహం చేసుకుంది. అప్పటి నుండి తల్లి, ఆమె భర్త.. పెద్ద కూతురిని హింసించడం మొదలు పెట్టారు. పొరుగువారు బాలికపై శారీరక వేధింపుల సంకేతాలను గమనించి, ఇంటి నుండి తరచుగా కేకలు విన్న తర్వాత పోలీసులకు సమాచారం అందించారు" అని అధికారి తెలిపారు. పోలీసులు ఇంటికి చేరుకున్నప్పుడు, కుమార్తె పెద్ద పెద్ద కాలిన గాయాలతో ఉన్నట్లు వారు కనుగొన్నారు. "నాలుగేళ్ల చిన్నారి శరీరంపై కాలిన గాయాలు, బుగ్గలపై వాపు, మెడ మీద గాయాలు ఉన్నాయి" అని అధికారి తెలిపారు. నజ్వీమ్, జావేద్ ఇద్దరినీ అరెస్టు చేశారు. బాలికను చికిత్స మరియు రక్షణ కోసం చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించారు.