రాజన్న సిరిసిల్లలో కలకలం.. తాగిన మైకంలో పాపను విక్రయించిన తల్లి

పీకలదాకా మద్యం సేవించిన తల్లి.. ఆ మద్యం మత్తులో పాపను లక్ష రూపాయలకు విక్రయించింది. మత్తు దిగాక తన పాపని ఎవరో అపహరించారంటూ పోలీసులను ఆశ్రయించింది.

By అంజి  Published on  24 Oct 2024 12:02 PM IST
రాజన్న సిరిసిల్లలో కలకలం.. తాగిన మైకంలో పాపను విక్రయించిన తల్లి

పీకలదాకా మద్యం సేవించిన తల్లి.. ఆ మద్యం మత్తులో పాపను లక్ష రూపాయలకు విక్రయించింది. మత్తు దిగాక తన పాపని ఎవరో అపహరించారంటూ పోలీసులను ఆశ్రయించింది. ఈ చిత్ర విచిత్రమైన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ పట్టణంలో నివాసం ఉంటున్న బత్తుల శ్యామలకు ఐదుగురు పిల్లలు ఉన్నారు. మొన్న కల్లు దుకాణంలో తల్లి శ్యామల పీకలదాకా మద్యం సేవించింది. ఆ మద్యం మత్తులో పిల్లలు లేని ఒక మహిళకు తన పాపను ఇస్తానని బేరసారాలు ఆడింది. లక్ష రూపాయలకు ఇద్దరు మధ్య ఒప్పందం కుదిరింది

అనంతరం శ్యామల తన పది నెలల శిశువును జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన లక్ష్మికి ఇచ్చి 90 వేల రూపాయలు తీసుకుంది. ఉదయం తన పది నెలల శిశువుని ఎవరో అపహరించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు వేట కొనసాగించి చివరకు లక్ష్మీ వద్ద ఉన్న శిశువును తీసుకువచ్చి తల్లి శ్యామలకు అప్పగించారు. కానీ జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన లక్ష్మీ.. సిరిసిల్ల కల్లు మండువాలో బత్తుల శ్యామల తనకు ఐదుగురు పిల్లలు ఉన్నారని, అందులో చిన్న పాపను ఇస్తామని చెప్పడంతో వేములవాడకు వచ్చామని లక్ష్మీ వెల్లడించింది.

అంతేకాకుండా లక్ష రూపాయలకు ఒప్పందం కుదరడంతో వేములవాడ మున్సిపల్ పరిధిలోని తిమ్మాపూర్ లో పాపను కొనుగోలు చేశామని, అందుకు 90 వేల రూపాయలు శ్యామలకు ఇచ్చి బాండ్ పేపర్ రాసుకున్నామని లక్ష్మీ తెలిపింది. అంతేకానీ తాను పాపను ఎత్తుకెళ్లలేదని... 90 వేల రూపాయలు శ్యామలకు ఇచ్చానని, తన దగ్గర తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని లక్ష్మీ డిమాండ్ చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.

Next Story