హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో కన్నతల్లే ఇద్దరు కుమారులను పొట్టనబెట్టుకుని, తాను కూడా ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది. వరంగల్ జిల్లాకు చెందిన బానోత్ ప్రవీణ్, స్రవంతి దంపతులకు కార్తీక్, కౌశిక్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే, ప్రవీణ్ కొద్దికాలం క్రితం మరో యువతిని వివాహం చేసుకోవడంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. నాలుగు రోజుల క్రితం గొడవపడి పుట్టింటికి వెళ్లిన స్రవంతిని, పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించి ప్రవీణ్ తిరిగి కూకట్‌పల్లికి తీసుకువచ్చాడు.
ఈ క్రమంలో మంగళవారం ఉదయం ప్రవీణ్ డ్యూటీకి వెళ్లిన సమయంలో స్రవంతి తన ఇద్దరు పిల్లలను హత్య చేసి, అనంతరం తానూ ప్రాణాలు తీసుకుంది. ఇంటికి వచ్చిన ప్రవీణ్ తలుపులు పగలగొట్టి చూడగా ముగ్గురూ విగతజీవులుగా కనిపించారు. సమాచారం అందుకున్న బాలానగర్ ఏసీపీ నరేష్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాలే ఈ ఘోరానికి కారణమని భావిస్తున్న పోలీసులు, పిల్లలను ఎలా హత్య చేసింది అనే కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.