చిన్నారులను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది అమ్మ. ఎన్ని కష్టాలు వచ్చినప్పటికి బిడ్డలకు ఏ కష్టం రాకుండా చూసుకుంటుంది. అలాంటి అమ్మ.. క్షణికావేశానికి లోనైంది. తన బిడ్డ పుట్టిన రోజును ఘనంగా చేయలేదని ఆగ్రహించింది. అంతే.. కన్నప్రేమను మరిచి తన బిడ్డ గొంతు కోసేసింది. అనంతరం తాను పురుగుల మందు తాగింది. ఈ ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా రుద్రవరానికి చెందిన సుధాకర్.. తన సొంత అక్క కుమారై మౌనికతో మూడేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి విక్రమ్(1) అనే చిన్నారి జన్మించాడు. సుధాకర్ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
ఇటీవల సుధాకర్ అన్న కుమారుడి మొదటి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇక ఈ నెల 26న విక్రమ్ మొదటి పుట్టిన రోజు వేడులకలను కూడా అలాగే ఘనంగా నిర్వహించాలని మౌనిక.. సుధాకర్‌ను కోరింది. అయితే.. సుధాకర్ మాత్రం సాదాసీదాగా చేశాడు. దీంతో మౌనిక తీవ్ర మనస్థాపానికి గురైంది. బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కూరగాయలు కోసే కత్తితో తన కుమారుడి గొంతు కేసేసింది. అనంతరం బంధువులు తనను ఏమన్నా చేస్తారేమోనన్న భయంతో పురుగుల మందు తాగింది. ఇంటి బయటకు వచ్చి వాంతులు చేసుకుంటుండగా.. స్థానికులు గమనించారు. ఇంట్లోకి వచ్చి చూడగా.. రక్తపు మడుగులో విక్రమ్ కనిపించాడు. ఇద్దరిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే విక్రమ్ ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు తెలిపారు.