మూఢ‌న‌మ్మ‌కం..యూట్యూబ్‌లో పూజలు చూసి .. ఆరునెల‌ల చిన్నారి గొంతు కోసిన త‌ల్లి

Mother kills her Daughter in suryapet district.మూఢ న‌మ్మ‌కంతో పూజ‌ల పేరుతో ఆరు నెల‌ల బిడ్డ‌ను దేవుడి సాక్షిగా క‌త్తితో గొంతు కోసి చంపేసింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 April 2021 2:39 AM GMT
mother kills her daughter

బిడ్డ‌ను కంటికి రెప్ప‌లాకాపాడేది ఒక్క అమ్మ మాత్ర‌మేన‌ని అంటారు. ముక్కు ప‌చ్చ‌లార‌ని ఓ చిన్నారి పాలిట త‌ల్లే య‌‌మ‌దూత‌గా మారింది. మూఢ న‌మ్మ‌కంతో పూజ‌ల పేరుతో ఆరు నెల‌ల బిడ్డ‌ను దేవుడి సాక్షిగా క‌త్తితో గొంతు కోసి చంపేసింది. ఈ దారుణ ఘ‌ట‌న సూర్యాపేట జిల్లా మోతె మండ‌లంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివ‌రాల మేర‌కు.. మోతె మండ‌లం మేక‌పాటి తండాకు చెందిన బానోత్ భార‌తికి ఎనిదేళ్ల క్రితం మ‌హ‌బూబాబాద్ జిల్లాకు చెందిన ఓ వ్య‌క్తితో వివాహం అయింది. అయితే.. పెళ్లైన కొద్ది రోజుల‌కే వారిద్ద‌రు విడిపోయారు. అనంత‌రం భార‌తి స్వ‌గ్రామానికి వ‌చ్చి త‌ల్లిదండ్రుల‌తోనే ఉంటోంది.

ఈ క్ర‌మంలో.. అదే తండాకు చెందిన కృష్ణ‌ను ప్రేమించింది. వీరి పెళ్లికి మొద‌ట పెద్ద‌లు ఒప్పుకోక‌పోవ‌డంతో ఆమె ఆత్మ‌హ‌త్య‌కు య‌త్నించింది. దీంతో వారి పెళ్లిని రెండేళ్ల కింద‌ట పెద్ద మ‌నుషులు చేశారు. కాగా.. ఆరు నెల‌ల క్రిత‌మే వీరికి కూతురు(రీతు) పుట్టింది. భార‌తి ప్ర‌తి రోజు యూట్యూబ్‌లో వీడియోలు చూస్తూ త‌న‌ను తాను శివుడిగా భావిస్తూ ఉండేది. ఇటీవ‌ల ఆగ్రామానికి ఓ సాధువు రాగా.. అత‌డి వెళ్లి క‌లిసింది. ఆ సాధువు ఆమెకు స‌ర్ప‌దోషం ఉంద‌ని చెప్పాడు. ఆ దోషం తొలగాలంటే నాగపూజలు చేయాలని, అంతేకాకుండా నీకు జన్మించే మగ, ఆడబిడ్డ ఎవరైనా సరే వారిని బలివ్వాలని అతను చెప్పినట్లు సమాచారం.

అప్ప‌టి నుంచి వారంలో మూడు రోజులు భార‌తి నాగపూజ‌లు చేస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. ఈ క్రమంలోనే భారతికి ఆరు నెలల క్రితం ఆడ బిడ్డ రీతు పుట్టింది. తర్వాత చిన్నారిని బలిచ్చేందుకు భారతి రెండుమూడు సార్లు ప్రయత్నించిందని బంధువులు చెబుతున్నారు. భార్య మాన‌సిక ప‌రిస్థితిని భ‌ర్త కృష్ణ గ‌మ‌నించాడు. గురువారం మధ్యాహ్నం సూర్యాపేటకు పనిపై వెళుతూ అత్తమామల వద్దకు వెళ్లాడు. భారతికి మతిస్థితిమితం సరిగా లేదని.. త‌న కుమారై రీతును ఇంటికి తీసుకెళ్లాలని చెప్పి వెళ్ళాడు. అయితే వారు ఈ విష‌యాన్ని పెద్ద‌గా పట్టించుకోలేదు.

ఇదే అదునుగా బావించిన భార‌తి.. త‌న కూతురు రీతును దేవుడి ప‌టం ముందు ప‌డుకోబెట్టి క‌త్తితో గొంతు కోయ‌డంతో తీవ్ర ర‌క్త‌స్రావ‌మై ఆ ప‌సికందు అక్క‌డిక్క‌డే ప్రాణాలు కోల్పోయింది. 'నా బిడ్డ రీతును చంపేశా. ఇక నాకు నాగసర్ప దోషమే కాదు.. ఏ దోషం కూడా అడ్డురాదు..' అంటూ భారతి.. ఆ చిన్నారి గొంతు కోసిన కత్తి చేతపట్టుకుని తండాలోని తల్లి గారింటికి కేకలు వేసుకుంటూ వెళ్లింది. వెంటనే ఆమె త‌ల్లిదండ్రులు భార‌తి నివాసానికి చేరుకుని చూడ‌గా.. ర‌క్త‌పు మ‌డుగులో రీతు క‌నిపించింది. చిత్రపటాల ముందు పసుపు, కుంకుమలు, కొబ్బరి చిప్పలు ఉండటంతో ఈ దారుణానికి ముందు భారతి పూజలు నిర్వహించిందని భావిస్తున్నారు. కాగా.. బీఎస్సీ బీఈడీ చ‌దివిన భార‌తి ఐదేళ్ల కింద‌ట ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల‌కు స‌న్న‌ద్ద‌మైన‌ట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.


Next Story
Share it