విషాదం.. నిప్పంటించుకుని తల్లీకుమారుడు ఆత్మహత్య
Mother and son commits suicide lodge in Kamareddy District.కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ లాడ్జీలోని
By తోట వంశీ కుమార్ Published on 16 April 2022 11:04 AM ISTకామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ లాడ్జీలోని గదిలో తల్లీ, కుమారుడు నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. తెల్లవారుజామున గది నుంచి పొగలు రావడాన్ని గుర్తించిన లాడ్జి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతులను రామాయంపేటకు చెందిన పద్మ(65), సంతోష్(35) గా గుర్తించారు.
వివరాల్లోకి వెళితే.. పద్మ వైద్యం కోసం ఈ నెల 11న వారు కామారెడ్డికి వచ్చి ఓ లాడ్జిలో దిగారు. వైద్య పరీక్షల అనంతరం వారు శ్రీకాళభైరవ స్వామి ఆలయానికి వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. ఇక ఆత్మహత్యకు ముందు ఓ వీడియో చిత్రీకరించారు. దీనిని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. రామాయంపేట సీఐగా పనిచేసిన నాగార్జున గౌడ్‌తో పాటు మరో ఆరుగురు మా ఆత్మహత్యకు కారణం అని మృతులు వీడియోలో కన్నీరు మున్నీరుగా విలపించారు.
'బాసం శ్రీనుతో కలిసి వ్యాపారం చేశాను. అయితే.. శ్రీను వద్ద డబ్బులు లేకుంటే జితేందర్ గౌడ్ ఇచ్చాడు. వ్యాపారంలో వాటా కావాలని అడిగాడు. కుదరదని చెప్పాం. ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌లో పోస్టు పెడితే.. నన్ను పీఎస్‌కు పిలిచారు. అప్పటి సీఐ నాగార్జున గౌడ్ నా ఫోన్‌ను తీసుకున్నాడు. నన్ను ఆ కేసులో ఇరికించేందుకు యత్నించారు. తెల్లారి ఎస్పీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశా. ఓ పది రోజులు అయ్యాక పేస్‌బుక్ అంశంలో నాకు సంబంధం లేదన్నారు. అప్పటికే నా ఫోన్‌లోని సమాచారాన్ని జితేందర్ గౌడ్‌కు ఇచ్చారు. ఆ సమాచారం అడ్డంపెట్టుకుని జితేందర్ గౌడ్ మనుషులు నన్ను ఇబ్బంది పెట్టారు. ఈ విషయాన్ని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను. దాదాపు ఏడాదిగా ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. వ్యాపారం సాగనీయలేదు. నా కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టారు. అప్పులు చేశాను. మానసికంగా కృంగిపోగా.. నమ్మిన స్నేహితుడి మోసం చేయడం తట్టుకోలేకపోయా. వాళ్ల వేదింపులు తట్టుకోలేక చనిపోతున్నా' అని వీడియోలో సంతోష్ చెప్పాడు.