కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఉరివేసుకుని తల్లీ, కూతురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన కడప నగరంలోని శంకరాపురంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కడపకు చెందిన శ్రావణి(29)కి శివకుమార్ రెడ్డితో పదేళ్ల క్రితం వివాహాం జరిగింది. వీరికి ఓ కుమారై తన్విక(8). శివకుమార్ రెడ్డి ప్రస్తుతం అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. కాగా.. భార్య భర్తల మధ్య మనస్పర్థల కారణంగా గత ఐదేళ్లుగా వీరిద్దరు దూరంగా ఉంటున్నారు.
ఈక్రమంలో శ్రావణి శంకరాపురం రామాలయం వీధిలో తన కుమారైతో కలిసి నివసిస్తోంది. ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో రిసెప్షనిస్టుగా పని చేస్తోంది. ఈ క్రమంలో గురువారం ఉదయం శ్రావణి తన కుమారైతో కలిసి పడక గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వీరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్థానికంగా తల్లి, కూతురు ఆత్మహత్య కలకలం రేపుతోంది.