ఒడిశా రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఖుర్దా జిల్లాలోని బానాపూర్ దగ్గర సస్పెండ్ చేయబడిన బీజేడీ ఎమ్మెల్యే ప్రశాంత్ జగదేవ్ వాహనం జనంపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు పోలీసు సిబ్బందితో సహా కనీసం 22 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. బ్లాక్ చైర్‌పర్సన్ ఎన్నిక జరుగుతుండగా బీడీఓ బాణాపూర్ కార్యాలయం వెలుపల గుమిగూడిన జనంలో కొంత మందిని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో చిలికా ఎమ్మెల్యే కూడా తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో బాణాపూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్-ఇన్-చార్జ్ ఆర్ఆర్ సాహుతో సహా ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
గాయపడిన వారిని భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. దాదాపు 15 మంది బీజేపీ కార్యకర్తలు, ఏడుగురు పోలీసులు గాయపడ్డారు. దీనిపై విచారణ ప్రారంభించాం'' అని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఎమ్మెల్యేకు తొలుత టాంగీ ఆసుపత్రిలో చికిత్స అందించి అనంతరం భువనేశ్వర్‌కు తరలించినట్లు ఖుర్దా ఎస్పీ అలేఖ్ చంద్ర పాహి తెలిపారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు జగదేవ్ గతేడాది సస్పెన్షన్‌కు గురయ్యారు. "ఇంకా ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లు నివేదిక లేదు." అని తెలిపారు.