అదృశ్యం కేసు విషాదాంతం.. క‌ట్నం కోసం భార్య‌ను

Missing girl found dead after a month near Chittoor.ప్రేమిస్తున్నాను అంటూ వెంట‌ప‌డ్డాడు. నువ్వు కాదంటే

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Aug 2022 12:25 PM IST
అదృశ్యం కేసు విషాదాంతం.. క‌ట్నం కోసం భార్య‌ను

ప్రేమిస్తున్నాను అంటూ వెంట‌ప‌డ్డాడు. నువ్వు కాదంటే బ్ర‌త‌క‌లేన‌ని చెప్పాడు. అత‌డి మాట‌ల‌ను న‌మ్మిన ఆ యువ‌తి అత‌డిని వివాహం చేసుకుంది. రెండేళ్ల పాటు బుద్ధిగానే ఉన్నాడు. ఆ త‌రువాత అత‌డిలోని మృగం బ‌య‌ట‌కు వ‌చ్చింది. క‌ట్నం కోసం నిత్యం వేదించేవాడు. ఈ క్ర‌మంలో చివ‌రికి దారుణానికి పాల్ప‌డ్డాడు.

పోలీసులు తెలిపిన వివ‌రాల మేర‌కు.. చెన్నైకి సమీపంలోని పుజిల్‌కు చెందిన తమిళ్‌సెల్వి ఇంటర్ చ‌దివింది. అనంత‌రం ఇంటి వ‌ద్ద‌నే ఉంటోంది. రెడ్‌హిల్స్‌లో మెకానిక్‌గా పనిచేస్తున్న మదన్ ప్రేమిస్తున్నాను అంటూ సెల్వి వెంట‌ప‌డి ఆమెను ప్రేమ‌లో పడేశాడు. మూడేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన రెండు సంవ‌త్స‌రాల పాటు వీరి సంసారం బాగానే ఉంది. ఆ త‌రువాత మ‌ద‌న్ క‌ట్నం తేవాలంటూ రోజు వేదింపుల‌కు గురి చేసేవాడు. ఈ విష‌య‌మై అప్పుడ‌ప్పుడూ దంప‌తుల మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రుగుతుండేవి.

ఈ క్ర‌మంలో జూన్ 25న సెల్విని తిరుప‌తి జిల్లా నారాయ‌ణ‌వ‌నం మండ‌లంలోని కైలాస‌నాథ కోన‌కు తీసుకువ‌చ్చాడు. అక్క‌డ మ‌రోసారి వారిద్ద‌రి మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది. త‌న వెంట తెచ్చుకున్న క‌త్తితో భార్య‌ను పొడిచి మదన్ పారిపోయాడు. సెల్వి క‌నిపించ‌క‌పోవ‌డంతో ఆమె త‌ల్లిదండ్రులు పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. పోలీసులు త‌మ‌దైన శైలిలో మ‌ద‌న్‌ను విచారించ‌గా అస‌లు నిజం చెప్పేశాడు. ఆదివారం తమిళనాడు పోలీసులు నారాయణవనం పోలీసులు, స్థానికుల సాయంతో కొండ‌పైన గాలించ‌గా అస్థిపంజ‌ర స్థితిలో సెల్వి మృత‌దేహాం క‌నిపించింది. పోస్టుమార్టం అనంత‌రం మృత‌దేహాన్ని ఆమె త‌ల్లిదండ్రుల‌కు అప్ప‌గించారు.

Next Story