తమిళనాడులోని చెంగల్‌పేట సమీపంలోని ఒక గ్రామంలోని పంచాయతీ కార్యాలయం లోపల తెరిచి ఉన్న సెప్టిక్ ట్యాంక్ నుండి తప్పిపోయిన ఆరేళ్ల బాలుడి మృతదేహాన్ని వెలికితీశారు. సమీపంలోని ఆర్‌ఓ ప్లాంట్ నుంచి తండ్రి తాగునీరు తీసుకువస్తుండగా బాలుడు కనిపించకుండా పోయాడు. శాస్తిరంబాక్కం గ్రామానికి చెందిన తండ్రి మణికందన్ తన ఆరేళ్ల కుమారుడు ప్రదీప్‌ను తీసుకుని వెంకటాపురం పంచాయతీ కార్యాలయం సమీపంలోని ఆర్‌ఓ ప్లాంట్‌లో తాగునీరు తెచ్చేందుకు తీసుకెళ్లాడు.
మణికందన్ తన కొడుకు సమీపంలోనే ఉన్నాడని భావించాడు. పెద్ద జనసమూహం మధ్య నీరు తీసుకురావడంపై దృష్టి పెట్టాడు. అయితే నీళ్లు తెచ్చిన తర్వాత కొడుకు కనిపించకపోవడంతో షాక్‌కు గురయ్యాడు. మణికందన్, సమీపంలోని ఇతర వ్యక్తులు ప్రదీప్ కోసం వెతకడం ప్రారంభించారు. అయితే పంచాయతీ కార్యాలయం వద్ద తెరిచి ఉన్న సెప్టిక్ ట్యాంక్‌లో అతని మృతదేహం కనిపించడంతో షాక్‌కు గురయ్యారు. పాలూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని శవపరీక్ష, పోస్టుమార్టం నిమిత్తం చెంగల్‌పట్టు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
మరోవైపు పంచాయతీ కార్యదర్శిని, ఓవర్‌హెడ్ ట్యాంక్ ఆపరేటర్‌ను జిల్లా అధికారులు సస్పెండ్ చేశారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పేర్కొంటూ పంచాయతీ అధ్యక్షుడిని వివరణ కోరారు. ఆరేళ్ల చిన్నారి మృతిపై చెంగల్‌పట్టు సబ్‌కలెక్టర్ కూడా విచారణ ప్రారంభించారు. తదుపరి విచారణ జరుగుతోంది.