తనతో కలిసి చదువుకుంటున్న ఆ అబ్బాయి.. ఇతర అమ్మాయిలతో కలిసి ఉండటాన్ని ఆ మైనర్ బాలిక చూడలేకపోయింది. ఇతర అమ్మాయిలతో అతనికి ఉన్న సాన్నిహిత్యాన్ని చూసి అసూయతో అబ్బాయిని ఇరికించాలని కుట్ర పన్నింది. ఈ క్రమంలోనే బాలిక.. అతడు రాసినట్లుగా అత్యాచార బెదిరింపు లేఖలు రాసింది. అయితే పోలీసులు ఈ ఘటనకు సంబంధించిన కేసును ఛేదించారు. అసలు లేఖలు రాసింది ఎవరో గుర్తించారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
జోధ్‌పూర్‌లోని ఓ మైనర్ బాలిక తన సహచర విద్యార్థుల నుంచి అత్యాచారం, యాసిడ్ దాడి చేస్తామని బెదిరిస్తూ లేఖలు వచ్చాయని తెలిపింది. తొలుత బాలికలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి బాలుడిని లైంగిక నేరాల నుంచి బాలల రక్షణ చట్టం (పోక్సో) 2012 ప్రకారం అరెస్టు చేశారు. ఈ లేఖలు తన స్నేహితురాలు రాసిందని బాలుడు పేర్కొన్నాడు. అయితే దర్యాప్తులో అమ్మాయి నిజంగానే లేఖలు రాసినట్లు పోలీసులు కనుగొన్నారు. ఒకప్పుడు తనతో సన్నిహితంగా మెలిగిన అబ్బాయి క్లాసులో తన గురించి చెడుగా మాట్లాడుతున్నాడని నమ్మి లేఖలు పంపినట్లు బాలిక పోలీసుల ఎదుట అంగీకరించింది.
అతను ఇతర అమ్మాయిలతో కలిసి ఉండటం నచ్చక.. ఆమె అతనిని నిందించాలని నిర్ణయించుకుంది. ఆమె దాదాపు 50 లేఖలు రాసింది. బాలుడిపై ఫిర్యాదు చేయడానికి పోలీసు స్టేషన్‌కు వెళ్లింది. "మేము బాలిక చేతివ్రాతను పోల్చినప్పుడు.. కేసు స్పష్టమైంది" అని ఎస్పీ చక్రవర్తి సింగ్ అన్నారు. బాలుడు తాను నిర్దోషి అని ట్విట్టర్‌లో వీడియో విడుదల చేయడంతో పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు. తల్లిదండ్రుల ఎదుటే పోలీసులు విచారించగా తాను లేఖలు రాసినట్లు మైనర్ బాలిక అంగీకరించింది. పోలీసులు బాలుడిని కోర్టులో హాజరుపరిచి విడుదల చేయనున్నారు.