హుక్కా బార్‌లో మైనర్ బాలికపై అత్యాచారం

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లోని హుక్కా బార్‌లో డాక్టర్ దంపతుల మైనర్ కుమార్తె అత్యాచారానికి గురైంది.

By అంజి  Published on  5 March 2023 3:21 PM IST
Minor Girl , Uttarpradesh

హుక్కా బార్‌లో మైనర్ బాలికపై అత్యాచారం (ప్రతీకాత్మకచిత్రం)

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లోని బర్రా పోలీస్ స్టేషన్ సర్కిల్ పరిధిలోని హుక్కా బార్‌లో డాక్టర్ దంపతుల మైనర్ కుమార్తె అత్యాచారానికి గురైంది. ముగ్గురు నిందితులు సహా ఎనిమిది మందిపై బాలిక తండ్రి ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తన 16 ఏళ్ల కుమార్తెను వినయ్ ఠాకూర్ అనే వ్యక్తి శుక్రవారం కర్రాహిలోని ఎంజీ కేఫ్ (హుక్కా బార్)కి పిలిచాడని, అక్కడ ఆమెకు మత్తుమందులు కలిపిన శీతల పానీయాన్ని ఇచ్చాడని వైద్యుడు పోలీసులకు చెప్పాడు.

యువకుడు బాలికపై అత్యాచారం చేసి, ఆపై ఆమెను నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ అతని స్నేహితులు కూడా ఆమెపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించారు. బాలిక అడ్డు తెలపడంతో వారు ఆమెను వీడియో తీసి మరీ కొట్టారు. విషయం చెబితే వీడియో వైరల్ చేస్తానని బెదిరించారు. కూతురు ఇంటికి చేరుకుని జరిగిన విషయాన్ని తండ్రికి చెప్పింది. నిందితులపై అత్యాచారం, పోక్సో చట్టం, దాడి, బెదిరింపు తదితర సెక్షన్ల కింద పోలీసులు రిపోర్టు నమోదు చేశారు.

నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుడిపై రిపోర్ట్‌ను నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని బర్రా ఇన్‌స్పెక్టర్‌ను ఆదేశించినట్లు నౌబస్తా ఏసీపీ అభిషేక్ పాండే తెలిపారు. నగరంలో ఫుడ్ కేఫ్‌ల పేరుతో డజనుకు పైగా హుక్కా బార్‌లు నడుస్తున్నాయి. హుక్కా బార్ నిర్వాహకులు ధనిక కుటుంబాలకు చెందిన యుక్తవయస్సులోని బాలికలకు గోప్యత పేరుతో క్యాబిన్‌లను అందిస్తారు. హుక్కా బార్లపై చర్యలు తీసుకుంటామని ఏసీపీ తెలిపారు.

Next Story