దారుణం.. మైనర్ బాలికపై 8 నెలల్లో 80 మంది అత్యాచారం..!
Minor girl molested by 80 men for 8 months.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో ఓ దారుణ ఘటన వెలుగుచూసింది.
By తోట వంశీ కుమార్ Published on 20 April 2022 1:14 PM ISTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో ఓ దారుణ ఘటన వెలుగుచూసింది. ఎనిమిది నెలలుగా 13 ఏళ్ల బాలికపై 80 మంది అత్యాచారానికి పాల్పడ్డారు. కరోనాతో ఆస్పత్రిలో చేరిన బాలిక తల్లిని మచ్చిక చేసుకున్న ఓ మహిళ.. బాలికను దత్తత తీసుకుంటున్నట్లుగా నటించింది. బాలిక తల్లి కరోనాతో మరణించగానే.. ఆ బాలికను బలవంతంగా వ్యభిచార కూపంలోకి దింపింది. ఎట్టకేలకు పోలీసులు ఆ బాలిక ను నరక కూపం నుంచి బయటకు తీసుకువచ్చారు.
వివరాల్లోకి వెళితే.. గతేడాది జూన్‌లో బాధితురాలి తల్లి కరోనాతో ఆస్పత్రిలో చేరింది. ఆ సమయంలోనే ఆస్పత్రిలో చేరిన సువర్ణ కుమారి అనే మహిళ బాధితురాలి తల్లితో పరిచయం పెంచుకుంది. వారి కుటుంబ పరిస్థితిని ఆసరాగా చేసుకుని మాయమాటలు చెప్పి బాధితురాలిని దత్తత తీసుకుంటానంటూ నమ్మబలికింది. ఆగస్టు నెలలో బాలిక తల్లి చనిపోయింది.
ఆ సమయంలో బాలిక తండ్రిని సమాచారం ఇవ్వకుండానే బాలికను సువర్ణకుమారి తీసుకువెళ్లింది. దీంతో బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసుకు సంబంధించి జనవరిలో తొలి అరెస్టు చేయగా.. మంగళవారం గుంటూరు వెస్ట్ పోలీసులు మరో 10 మందిని అదులోకి తీసుకున్నారు. మొత్తంగా ఇప్పటి వరకు 80 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఏఎస్పీ సుప్రజ చెప్పారు.
బాలికతో పాటు నిందితులను విచారించగా షాకింగ్ విషయాలు తెలిశాయన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎనిమిది నెలల పాటు వివిధ ప్రాంతాల్లో బాలికను తిప్పుతూ అనేక మంది అఘాయిత్యానికి పాల్పడ్డారు. పలుమార్లు అమ్మేశారన్నారు. హైదరాబాద్, విజయవాడ, నెల్లూరు, కాకినాడల్లో నిందితులను అదుపులోకి తీసుకున్నామని, వారి వద్ద నుంచి 53 సెల్‌ఫోన్లు, మూడు ఆటోలు, బైకులను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.