ఎస్సీ మైన‌ర్ బాలిక‌పై ప‌ది మంది అఘాయిత్యం.. గ‌ర్భం దాల్చిన బాధితురాలు

Minor Girl molested by 10 men in proddatur.అబ‌ల‌ల‌పై వ‌రుస‌గా అఘాయిత్యాలు జ‌రుగుతూనే ఉన్నాయి. చిన్న‌-పెద్ద

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 May 2022 9:54 AM IST
ఎస్సీ మైన‌ర్ బాలిక‌పై ప‌ది మంది అఘాయిత్యం.. గ‌ర్భం దాల్చిన బాధితురాలు

అబ‌ల‌ల‌పై వ‌రుస‌గా అఘాయిత్యాలు జ‌రుగుతూనే ఉన్నాయి. చిన్న‌-పెద్ద, ముస‌లి-ముత‌క అన్న తేడా లేదు. గ‌ర్భిణీలు, బాలింత‌ల‌ను కూడా వ‌ద‌ల‌డం లేదు కామాంధులు. భిక్షాట‌న చేస్తూ జీవ‌నం సాగిస్తున్న ఎస్సీ బాలిక‌పై ప‌ది మంది అత్యాచారానికి పాల్ప‌డ్డారు. ప‌దే ప‌దే అత్యాచారానికి పాల్ప‌డ‌డంతో బాలిక గ‌ర్భం దాల్చింది. దీంతో విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఈ దారుణ ఘ‌ట‌న వైఎస్ఆర్ క‌డ‌ప జిల్లాలో చోటు చేసుకుంది.

స్థానికులు తెలిపిన వివ‌రాల మేర‌కు.. ప్రొద్దుటూరుకు చెందిన ఓ మైనర్ బాలిక ప‌ట్ట‌ణంలోని ఓ మ‌సీదు వ‌ద్ద ఆశ్ర‌యం పొందుతూ భిక్షాటన‌ చేస్తూ జీవ‌నం సాగిస్తోంది. బాలిక త‌ల్లి చాలా ఏళ్ల క్రిత‌మే మ‌ర‌ణించ‌గా.. తండ్రి ప్రొద్దుటూరులోనే మ‌రో ప్రాంతంలో భికాట‌న చేస్తుంటాడు. ఈ క్ర‌మంలో ఓ డెక‌రేష‌న్ షాపులో ప‌ని చేస్తున్న అదే వీధిలో ఉండే చెంబు అనే యువ‌కుడి క‌న్ను బాలిక‌పై ప‌డింది. బాలిక‌కు మాయ‌మాట‌లు చెప్పి ప‌లు మార్లు అత్యాచారం చేశాడు. అతడి స్నేహితులు కూడా బాలికపై ప‌లు మార్లు అఘాయిత్యానికి పాల్ప‌డ్డారు.

దీంతో బాలిక గ‌ర్భం దాల్చింది. స్థానికులు వ‌న్‌టౌన్ పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వ‌గా.. గ్రామ సచివాలయ మహిళా కానిస్టేబుల్ బాలిక‌తో ఏకాంతంగా మాట్లాడి వివ‌రాల‌ను సేక‌రించింది. చెంబు, అత‌డి స్నేహితులు ప‌లు మార్లు అఘాయిత్యం చేసిన‌ట్లు బాలిక చెప్పింది. బాలిక చెప్పిన మాటలను వీడియో రికార్డు చేసిన కానిస్టేబుల్‌.. ఆ వీడియోను వ‌న్ టౌన్ పోలీసుల‌కు అందించింది. అయితే.. విష‌యాన్ని బ‌య‌ట‌కు పొక్క‌కుండా బాధితురాలిని వేరే చోట‌కి త‌ర‌లించారని, నిందితుల‌పై కేసు న‌మోదు చేయ‌లేద‌ని స్థానికులు చెబుతున్నారు.

గర్భిణీ అయిన బాలిక ప్రస్తుతం మైలవరంలో ఓ ప్రైవేట్ స్వచ్చంద స్థంస్థ‌కు చెందిన ఆశ్రమ‌మంలో ఆశ్ర‌యం పొందుతోంది. విష‌యం తెలుసుకున్న ఉన్న‌తాధికారులు ఘ‌ట‌న‌పై వివ‌ర‌ణ కోరారు. బాలిక‌పై అత్యాచార ఘ‌ట‌న త‌మ దృష్టికి వ‌చ్చింద‌ని, విచార‌ణ‌కు ఆదేశించిన‌ట్లు డీఎస్పీ ప్రసాదరావు తెలిపారు. నిందితుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు.

Next Story