అమ్మమ్మ ఇంటికి వెళ్లి వస్తుండగా అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి
Minor Girl Died in Suspicious Condition.ఇంటికి వెలుతుండగా మార్గమధ్యంలో అనుమానాస్పద స్థితిలో
By తోట వంశీ కుమార్ Published on 18 Jan 2023 10:33 AM ISTసంక్రాంతికి అమ్మమ్మ వాళ్ల ఇంటికి వచ్చింది. పండుగను ఎంతో సంతోషంగా జరుపుకుంది. తిరిగి ఇంటికి వెలుతుండగా మార్గమధ్యంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది బాలిక. ఈ ఘటన నల్లగొండ జిల్లా పీఏపల్లి మండలం అంగడిపేట స్టేజీ వద్ద జరిగింది.
పోలీసులు, బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుర్రంపోడు మండలంలోని మైలాపురం గ్రామానికి చెందిన దంపతులు హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి 16 ఏళ్ల బాలిక, ఓ బాబు సంతానం. సంక్రాంతి పండుగ సందర్భంగా మూడు రోజుల క్రితం బాలిక వాళ్ల అమ్మమ్మ గ్రామం పీఏపల్లి మండలంలోని వడ్డరిగూడెం గ్రామానికి వచ్చింది.
పండుగ అనంతరం తిరిగి హైదరాబాద్ వెళ్లేందుకు మంగళవారం బయలుదేరింది. అదే సమయంలో గ్రామానికి చెందిన నరేష్, శివలు కారులో వెలుతుండగా బాలికను అంగడిపేట స్టేజీ పేట వద్ద దింపమని వారిని బాలిక అమ్మమ్మ కోరింది. బాలిక అంగడిపేట స్టేజీ వద్ద గల ఓ బట్టల దుకాణం సమీపంలో దిగింది. వీరికి ఇదే గ్రామానికి చెందిన దిలీప్ కూడా కలిశాడు. అయితే.. మధ్యాహ్నాం వస్త్ర దుకాణం వద్ద బాలిక అపస్మారక స్థితిలో పడి ఉందని బాలిక మామయ్యకు ఫోన్ వచ్చింది. హుటాహుటిన బంధువులు అక్కడకు వెళ్లి అపస్మారక స్థితిలో ఉన్న బాలికను స్థానిక ఆర్ఎంపీ వద్దకు తీసుకువెళ్లగా బాలిక పరిస్థితి విషమంగా ఉందని దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లాలని సూచించాడు.
బాలికను దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే బాలిక మరణించిందని వైద్యులు తెలిపారు. బాలిక మృతి పట్ల స్థానికంగా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బాలికపై సామూహిక అత్యాచారం చేసి ఉంటారని, నిందితులను కఠినంగా శిక్షించాలని బంధువులు, బాలిక కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్ద ఆందోళన చేపట్టి రోడ్డుపై బైఠాయించారు. దేవరకొండ డీఎస్పీ నాగేశ్వర్‌రావు అక్కడకు చేరుకుని విచారణ చేసి న్యాయం జరిగేలా చూస్తానని సర్ది చెప్పడంతో వారు ఆందోళనను విరమించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.