16 సంవత్సరాల పిల్లాడు.. 12 ఏళ్ల కజిన్ ను చంపేశాడు.. కారణం ఏమిటంటే
Minor Boy killed his cousin brother in Rajasthan.వీడియో గేమ్స్ పిచ్చిలో పడి పిల్లలు అతి క్రూరంగా ప్రవర్తిస్తున్నారని
By M.S.R Published on 14 Dec 2021 7:18 AM GMTవీడియో గేమ్స్ పిచ్చిలో పడి పిల్లలు అతి క్రూరంగా ప్రవర్తిస్తున్నారని ఇప్పటికే చాలా ఘటనల ద్వారా మనకు తెలుస్తోంది. తాజాగా 16 ఏళ్ల మైనర్ బాలుడు తన కజిన్ అయిన 12 సంవత్సరాల పిల్లాడిని అతి దారుణంగా చంపేశాడు. నిందితుడు ఫ్రీ ఫైర్ మరియు PUBG గేమ్స్ మాయలో పడి గొడవ పడుతూ వరసకు తన సోదరుడిని గొంతు కోసి చంపాడు. హత్య అనంతరం నిందితుడు ఆ మృతదేహాన్ని కూడా భూమిలో పాతిపెట్టాడు. హత్యానంతరం ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఫేక్ ఐడీని సృష్టించి చిన్నారి తండ్రితో కిడ్నాప్ డ్రామా ఆడి.. పిల్లాడిని విడిపించుకోవాలంటే డబ్బులు ఇవ్వాలని నిందితుడు డిమాండ్ చేశాడు.
నాగౌర్ జిల్లాలోని లాద్నూన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 5 రోజుల క్రితం 12 ఏళ్ల మైనర్ పిల్లవాడు తన ఇంటి నుండి అదృశ్యమయ్యాడు. ఆ తర్వాత అతని గ్రామంలో చిన్నారి మృతదేహాన్ని గుర్తించడంతో ఆ గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. డిసెంబరు 8న చిన్నారి కనిపించకుండా పోవడంతో కుటుంబసభ్యులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. 5 రోజుల విచారణ, సైబర్ నిపుణుల సహాయంతో బాలుడి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మైనర్‌ను గొంతుకోసి చంపిన తర్వాత మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. చిన్నారి అదృశ్యమైన తర్వాత కిడ్నాప్ డ్రామా ఆడుతూ డబ్బులు డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులకు కాల్ వచ్చింది. నాగౌర్ పోలీస్ సూపరింటెండెంట్ అభిజిత్ సింగ్ ఆదేశాల మేరకు లాడ్‌నూన్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ దర్యాప్తు చేసి మిస్టరీని ఛేదించారు.
చనిపోయిన పిల్లాడి బంధువు ఫ్రీ ఫైర్, PUBG గేమ్ ఆడుతున్నప్పుడు కోపంలో అతని సోదరుడిని గొంతు కోసి చంపాడు, తరువాత మృతదేహాన్ని గ్రామం వెలుపల ఉన్న గొయ్యిలో పాతిపెట్టాడు. పోలీసులను, కుటుంబ సభ్యులను తప్పుదోవ పట్టించేందుకు మృతుడి ఫోన్ నుంచి సోషల్ సైట్ ద్వారా నకిలీ ఐడీని సృష్టించి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడు. సైబర్ నిపుణుడు సాంకేతిక పరిజ్ఞానంతో ఇంటర్నెట్ మూలాలను కనుగొని నిందితుడిని గుర్తించారు.