కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహానాన్ని ఓ పాల వ్యాను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటంబానికి ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
వివరాల్లోకి వెళితే.. రావుల పాలెం మండలం కొమర్రాజులంక కు చెందిన అప్పన నాగేశ్వరరావు అనే వ్యక్తి కొద్ది రోజులుగా కొత్తపేటలో ఓ మహిళతో కలిసి ఉంటున్నాడు. ఇంటికి రాకపోవడం, కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో నాగేశ్వరరావు తల్లి సత్యవతి(55), భార్య వెంకటలక్ష్మి(40),కుమారుడు మహేష్(20) శుక్రవారం తెల్లవారుజామున ద్విచక్రవాహనంపై కొమర్రాజులంక నుంచి కొత్తపేటకు వచ్చారు. ఈ విషయమై నాగేశ్వర రావును నిలదీశారు. మాట మాట పెరిగి ఘర్షణకు దారి తీసింది.
అనంతరం ముగ్గురు బైక్‌పై ఇంటికి వెలుతుండగా.. మందపల్లి వద్దకు వచ్చేసరికి రావులపాలెం నుంచి కొత్తపేట వైపు వెలుతున్న పాల వ్యాన్ వీరిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంతో సత్యవతి, వెంకటలక్ష్మి, మహేష్ తీవ్రగాయాలతో ఘటనాస్థలంలోనే కన్నుమూశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.