చిత్తూరు జిల్లాలో ఘోరం జరిగింది. పేపర్ ప్లేట్లు తయారు చేసే పరిశ్రమలో మంటలు చెలరేగి ముగ్గురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు.
వివరాలు ఇలా ఉన్నాయి. చిత్తూరు నగరంలోని రంగాచారి వీధిలో భాస్కర్ అనే వ్యక్తి రెండు అంతస్తుల భవనంలో తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. గ్రౌండ్ ఫ్లోర్‌లో పేపర్ ప్లేట్స్ తయారీ యూనిట్‌ను నిర్వహిస్తుండగా.. పై అంతస్తులో ఉంటున్నాడు. మంగళవారం అర్థరాత్రి దాటిన తరువాత అందరూ గాఢ నిద్రలో ఉండగా.. పేపర్ ప్లేట్స్ తయారీ యూనిట్‌లో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు పై అంతస్తుకు వ్యాపించాయి. ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడుతుండడంతో గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
రెండు ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో పరిశ్రమ యజమాని భాస్కర్(65)తో పాటు అతడి కుమారుడు ఢిల్లీ బాబు(35), మరో వ్యక్తి బాలాజీ(25) మరణించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు బావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కాగా.. పుట్టినరోజునే ఢిల్లీ బాబుతో పాటు అతడి తండ్రి, స్నేహితుడు మృత్యువాత పడినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది.