దారుణం.. వ్యక్తి చేయి నరుక్కుని తీసుకెళ్లిన దుండగులు

Masked men chop, take away man’s hand in Haryana. హర్యానాలోని కురుక్షేత్రలో దారుణ ఘటన జరిగింది. జాతీయ రహదారి-44లోని రెస్టారెంట్

By అంజి  Published on  10 Jan 2023 3:01 PM IST
దారుణం.. వ్యక్తి చేయి నరుక్కుని తీసుకెళ్లిన దుండగులు

హర్యానాలోని కురుక్షేత్రలో దారుణ ఘటన జరిగింది. జాతీయ రహదారి-44లోని రెస్టారెంట్ సమీపంలో సోమవారం కనీసం డజను మంది గుర్తుతెలియని దుండగులు ఒక వ్యక్తి చేతిని నరికివేశారు. దుండగులు అక్కడి నుంచి వెళ్లే ముందు బాధితుడి చేయిని కూడా తీసుకెళ్లారు. సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కురుక్షేత్ర హవేలీలో జరిగిన ఈ ఘటనలో ముఖాలకు మాస్కులు కప్పుకున్న 10-12 మంది వ్యక్తులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిపై దాడి చేసి చేయి నరికేశారు. వారితోపాటు ఛిద్రమైన చేతిని కూడా దుండగులు ఎత్తుకెళ్లారు.

బాధితుడిని కర్నాల్ జిల్లా రహ్రా గ్రామానికి చెందిన జుగ్నుగా గుర్తించారు. ఆయనను లోక్‌నాయక్ జయప్రకాశ్ ఆసుపత్రిలో చేర్పించారు. రెస్టారెంట్‌లోని ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతూ.. ''10-12 మంది ముఖాలకు మాస్క్‌లు ధరించి వచ్చి ఓ వ్యక్తి పక్కన కూర్చొని ఉన్నారు. ఆ తర్వాత వారు అతడితో గొడవ ప్రారంభించారు. ఆ వ్యక్తిపై దాడి చేశారు. దుండగులు అతని చేతులు నరికి వారితో పారిపోయారు" అని చెప్పారు. దాడికి గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు.

సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రామ్‌దత్ నైన్ తెలిపిన వివరాల ప్రకారం.. బాధితుడికి అంకుష్ కమల్‌పూర్‌తో పాటు ఇతరులతో ఏదో ఒక విషయంలో శత్రుత్వం ఉంది. నిందితుడిని గుర్తించేందుకు సీసీటీవీ ఆధారాలను పరిశీలిస్తున్నామని అధికారులు తెలిపారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా కురుక్షేత్ర ఎస్పీ మాట్లాడుతూ.. 2020లో కర్నాల్‌లో హత్యాయత్నం కేసులో అరెస్టయిన జుగ్ను ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చాడు అని చెప్పారు.

Next Story