భర్త కుట్టిన బ్లౌజ్ నచ్చలేదని విజయలక్ష్మీ ఆత్మహత్య
Married women suicided in Amberpet.ఇటీవల చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలకు పాల్పడుతన్న వారి సంఖ్య
By తోట వంశీ కుమార్
ఇటీవల చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. అమ్మ తిట్టిందనో, నాన్న కొట్టాడనో, ప్రేమించిన అమ్మాయి కాదు అని చెప్పిందనో, నచ్చిన వస్తువు కొనివ్వలేదనో ఇలా చిన్న చిన్న విషయాలకే బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ భర్త కుట్టిన బ్లౌజ్ నచ్చలేదని భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని అంబర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. గోల్నాకలోని తిరుమలనగర్‌లో ఇద్దరు పిల్లలతో కలిసి శ్రీనివాసులు, విజయలక్ష్మి (35)దంపతులు నివసిస్తున్నారు. శ్రీనివాసులు ద్విచక్రవాహనంపై తిరుగుతూ చీరలు అమ్ముతుంటాడు. అంతేకాకుండా ఇంట్లో టైలరింగ్ కూడా చేస్తుంటాడు. ఈ క్రమంలో శనివారం భార్య విజయలక్ష్మీ కోసం ఓ బ్లౌజ్‌ను కుట్టాడు. శ్రీనివాసులు కుట్టిన బ్లౌజ్ విజయలక్ష్మీకి నచ్చలేదు. ఇదే విషయాన్ని అతడికి చెప్పింది. దీంతో శ్రీనివాసులు బ్లౌజ్ కుట్లు విప్పి నీకు నచ్చినట్లు నువ్వే కుట్టుకో అని అన్నాడు.
దీంతో విజయలక్ష్మీ మనస్థాపానికి గురైంది. గదిలోకి వెళ్లి తలుపువేసుకుంది. శ్రీనివాసులు తన పనిలో తాను నిమగ్నం అయ్యాడు. స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు.. తలుపును ఎంతసేపు కొట్టినప్పటికి తీయకపోవడంతో శ్రీనివాసులు బలవంతంగా తలుపు తెరిచి చూడగా.. విజయలక్ష్మీ ఉరివేసుకుని ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.