టీ పొడి తీసిన ప్రాణం
Married Woman ends life over tea reprimand.తాజాగా.. టీలో కాస్త టీ పొడి ఎక్కువైందని అత్త మందలించిందనే కారణంగా ఓ కోడలు ఆత్మహత్యకు పాల్పడింది
By తోట వంశీ కుమార్ Published on 4 May 2021 7:56 AM ISTఇటీవల కాలంలో చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు తిట్టారనో, అనుకున్నది సాధించలేదనో, ప్రియురాలు మాట్లాడలేదనో క్షణికావేశంలో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. వారిని నమ్ముకున్న వారి గురించి కనీసం ఆలోచించకుండా వారు చేసే ఈ పనుల కారణంగా వారి కుటుంబ సభ్యులు ఎంతో ఆవేదనకు గురవుతున్నారు. తాజాగా.. టీలో కాస్త టీ పొడి ఎక్కువైందని అత్త మందలించిందనే కారణంగా ఓ కోడలు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గోల్కొండలోని రేషమ్‌బాగ్‌లో సయ్యద్ హబీబ్ అనే వ్యాపారి తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. మే 1 తేదీన ఆయన తల్లి సఫియాబేగం.. టీ ఇవ్వాల్సిందిగా కోడలు బీబీ(24) ను కోరింది. అత్త అడగడంతో.. వెంటనే కోడలు టీ చేసి అత్తకు ఇచ్చింది. అయితే.. అందులో కాస్త టీ పొడి ఎక్కువ కావడంతో సఫియా బేగం కోడలు బీబీని మందలించింది. అత్త మందలించడంతో కోడలు బీబీ తీవ్ర మనస్థాపం చెందింది. తన గదిలోకి వెళ్లి ఉరి వేసుకుంది. ఎంతసేపటికి ఆమె బయటకు రాకపోవడంతో.. కుటుంబ సభ్యులు ఆమె గది తలుపులు తట్టారు. ప్రమోజనం లేకపోవడంతో తలుపులు బద్దలు కొట్టి లోనికి వెళ్లగా.. అక్కడ బీబీ ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతురాలికి ఓ కూతురు ఉంది.