కిడ్నాప్ చేసిన మాజీ సర్పంచ్‌ను హత్య చేసిన మావోయిస్టులు
Maoist killed former Sarpanch in Mulugu District.ములుగు జిల్లా వెంకటాపురం (కె) మండలం సూరువీడు గ్రామ పంచాయతీ
By తోట వంశీ కుమార్ Published on 22 Dec 2021 2:46 PM ISTములుగు జిల్లా వెంకటాపురం (కె) మండలం సూరువీడు గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ రమేశ్ ను మావోయిస్టులు హతమార్చారు. సోమవారం సాయంత్రం ఆయన్ను కిడ్నాప్ చేసిన మావోలు హత్య చేసి.. మృతదేహాన్ని ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని కొత్తపల్లి సమీపంలో వదిలివెళ్లారు. మృతదేహాం వద్ద ఓ లేఖను విడిచిపెట్టారు. పోలీసు ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరిస్తున్నాడనే కారణంతోనే అతడిని హతమార్చినట్లు అందులో పేర్కొన్నారు.
ఈ ఘటనతో ఏజెన్సీ ప్రాంతాల్లో తమ ప్రాబల్యాన్ని చాటుకునేందకు మావోయిస్టులు ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. మాజీ సర్పంచ్, ప్రస్తుతం డ్రైవర్ వృత్తి చేసుకుంటున్న రమేశ్‌ను మావోయిస్టులు సోమవారం రాత్రి ములుగు జిల్లా వెంకటాపురం (కె) మండలం సూరువీడు పంచాయతీ కె కొండాపురం వద్ద కిడ్నాప్ చేసినట్లు స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు రమేశ్ కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని కొత్తపల్లి సమీపంలో రమేశ్ మృతదేహాన్ని గుర్తించారు.
రమేశ్ 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్‌గా గెలిచారు. ఆ తర్వాత రమేశ్ భార్య రజితకు ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రిలో ఏఎన్‌ఎం ఉద్యోగం రావడంతో ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఐటీడీఏ క్వార్టర్స్ సమీపంలో నివాసం ఉంటున్నారు. గతంలో రమేశ్ మావోయిస్టులకు కొరియర్ గా పనిచేశాడు. అయితే.. పోలీసులకు ఇన్‌ఫార్మర్‌గా పనిచేస్తున్నాడని మావోయిస్టులు ఆయనపై ఆరోపణలు చేశారు. ఇటీవల జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌కు అతడే కారణం అని, ఓ మావోయిస్టు నేతకు విషాహారం పెట్టి అతడి మరణానికి కారణం అని మావోయిస్టులు ఆ లేఖలో ఆరోపించారు. ప్రజాకోర్టు నిర్వహించి.. రమేశ్ తప్పులు ఎత్తి చూపి అక్కడే అతడిని హత్య చేసినట్లు మావోయిస్టులు ఆ లేఖలో పేర్కొన్నారు.