భార్య ఆత్మహత్య.. మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ అరెస్ట్
Mancherial Municipal Commissioner Held for Abetment of Suicide. భార్య జ్యోతిని పలు కారణాలతో ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాడన్న ఆరోపణలతో
By అంజి
భార్య జ్యోతిని పలు కారణాలతో ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాడన్న ఆరోపణలతో మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ నల్లమల బాల కృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. బాల కృష్ణ, అతని తల్లి కన్నమ్మ, సోదరుడు హరికృష్ణ, సోదరి కృష్ణ కుమారి, అత్త లక్ష్మి, బంధువు జ్యోతిలను అదుపులోకి తీసుకున్నట్లు మంచిర్యాల సబ్ ఇన్‌స్పెక్టర్ ఎన్ సుగుణాకర్ తెలిపారు. సాయంత్రంలోగా వారిని కోర్టు ముందు హాజరు పరుస్తామని తెలిపారు. బాల కృష్ణతో పాటు మరో ఐదుగురిపై జ్యోతి తల్లి జయమ్మ ఫిర్యాదు చేసింది.
ఆమె ఫిర్యాదు ఆధారంగా భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 306 (ఆత్మహత్యకు ప్రేరేపించడం), 498 ఎ (గృహ హింస) కింద ఆరుగురిపై కేసు నమోదు చేశారు. బాల కృష్ణ, జ్యోతి ఇద్దరి మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల పట్టణం మేదరివాడలోని ఆదిత్య ఎన్ క్లేవ్ లో మున్సిపల్ కమీషనర్ బాలకృష్ణ భార్య జ్యోతి, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం మధ్యాహ్నం మంచిర్యాల ఆదిత్య ఎన్‌క్లేవ్ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లోని తన బెడ్‌రూమ్‌లో జ్యోతి(32) ఉరి వేసుకుని కనిపించింది.
ఖమ్మం జిల్లాకు చెందిన బాలకృష్ణ గతంలో పోలీసు శాఖలో పని చేశారు. ఆ తర్వాత సర్వీస్ కమిషన్ పరీక్షలు రాసి నిర్మల్ మున్సిపల్ కమిషనర్ గా తొలి పోస్టింగ్ పొందారు. పదోన్నతిపై గ్రేడ్ వన్ కమిషనర్ గా మంచిర్యాలకు వచ్చారు. బాలకృష్ణ జ్యోతి దంపతులకు కొడుకు, కూతురు ఉన్నారు. బాలకృష్ణ మున్సిపల్ కమిషనర్‌గా ఎంపికైన నాటి నుంచి జ్యోతిని వేధింపులకు గురి చేసేవాడని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అతనితో పాటు ఆయన కుటుంబ సభ్యులు తమ కూతుర్ని సూటిపోటి మాటలతో ఇబ్బందులకు గురి చేసేవారని చెబుతున్నారు.