కోల్‌కతాలో ఐఏఎస్ అధికారిలా నటించి ఓ మహిళను మోసం చేసినందుకు 61 ఏళ్ల వ్యక్తిని అరెస్ట్ చేశారు. వివిఐపి కోటాలో రాజర్‌హత్ మెగాసిటీలో రెండు ప్రభుత్వ ఫ్లాట్‌లను కేటాయిస్తామని, ఫారిన్ లిక్కర్ లైసెన్స్ కూడా ఇస్తామని చెబుతూ శాంతో కుమార్ మిత్రా అనే నిందితుడు ఓ మహిళను, ఆమె కుమార్తెను మోసం చేశాడు. వాళ్ల దగ్గర నుండి రూ.11.8 లక్షలు లాగేసుకున్నాడు. అతడిపై మంజు ఘోష్ అనే మహిళ ఫిర్యాదు చేసింది. తాను తన కుమార్తెతో కలిసి 'నకిలీ' ఐఏఎస్ అధికారికి రూ.11.76 లక్షలు చెల్లించామని, అయితే అతను తమకు చెప్పింది ఏదీ చేయలేదని తెలిపారు. డబ్బులు అడిగితే తిరిగి ఇవ్వలేదని మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది.
పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు బర్తాలాలోని ఓ హోటల్‌లో ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని హోటల్ గదిలో కొన్ని పత్రాలు లభించాయని పోలీసులు తెలిపారు. హోటల్ ముందు పార్క్ చేసిన అతని ఐ20 కారుపై పలు ప్రభుత్వ అధికారుల స్టిక్కర్లు ఉన్నాయి. పోలీసులు వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు.