కేరళ రాష్ట్రంలో మరో దారుణం వెలుగు చూసింది. తన కుక్కకు ఆహారం ఇవ్వలేదని 21 ఏళ్ల యువకుడిని.. అతని బంధువు కొట్టి చంపాడు. అక్టోబర్ 4వ తేదీన పాలక్కాడ్ పరిధిలోని ములాయంకపు ప్రాంతంలో ఈ షాకింగ్ సంఘటన జరిగింది. తన బంధువును కొట్టి చంపినందుకు 27 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. బాధితుడిని 21 ఏళ్ల హర్షద్‌గా గుర్తించారు. అతని బంధువు హకీమ్ (27)ని కొప్పం పోలీసులు అరెస్ట్ చేశారు. వారిద్దరూ ఉంటున్న ఇంటి పైనుంచి హర్షద్ కిందపడిపోయాడని చెప్పి.. శుక్రవారం అతడిని హకీం అతని స్నేహితులతో కలిసి ఆస్పత్రికి తీసుకెళ్లాడు. వీరు పెరుంతోడి గ్రామంలో కలిసి ఉంటూ కేబుల్ వర్క్ చేసేవారు.
హర్షద్ ఇంటి పైకప్పుపై నుండి పడిపోయాడని నిందితుడు పేర్కొన్నప్పటికీ, అతని శరీరంపై గాయం గుర్తులు ఉన్నందున, మృతుడు దారుణంగా కొట్టబడ్డాడని వైద్యులు నిర్ధారించారు. చికిత్స చేసినప్పటికీ హర్షద్ బతకలేదు. అతని పక్కటెముకలు విరిగి, అంతర్గత రక్తస్రావం కారణంగా అతను మరణించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో తన కుక్కకు ఆహారం పెట్టలేదని హర్షద్‌ను శుక్రవారం హకీమ్ కొట్టినట్లు తేలింది. కుక్క బెల్టు, చెక్క కర్రతో హర్షద్‌ను కొట్టానని హాకీమ్ చెప్పాడు. దీని ఆధారంగా కొప్పం పోలీసులు హకీమ్‌ను అదుపులోకి తీసుకుని అనంతరం అరెస్టు చేశారు.