మూత్రశాలలు ఉన్నప్పటికీ కొందరు ఎక్కడ పడితే అక్కడ మూత్ర విసర్జన చేస్తుంటారు. ఇలా రోడ్డు పక్కగా ఉన్న ఓ ఇంటి గోడపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేశాడు. గోడపై మూత్రం పోస్తావా అంటూ నలుగురు వ్యక్తులు అందరూ చూస్తుండగానే సదరు వ్యక్తిని కత్తులతో పొడిచి చంపారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. మయాంక్(25) అనే వ్యక్తి హోటల్ మేనేజ్‌మెంట్ చదువుతున్నాడు. గురువారం సాయంత్రం ఓ ఇంటి గోడపై మూత్రం పోశాడు. దీన్ని గమనించిన ఇంటి యజమానురాలు అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఇద్దరి మద్య మాటా మాటా పెరిగింది. వివాదం పెద్దది కావడంతో ఇంటి యజమానురాలు కొడుకు మనీష్ జోక్యం చేసుకున్నాడు. మనీష్‌పై దాడికి దిగాడు మయాంక్.
మనీష్.. తన స్నేహితులను పిలిచాడు. వారంతా కలిసి మయాంక్ ను వెంబడించారు. చివరకు దక్షిణ ఢిల్లీకి చెందిన మాలవీయ నగర్‌లోని డీడీఏ మార్కెట్ వద్ద మయాంక్‌ను అడ్డగించారు. అందరూ చూస్తుండగానే విచక్షణారహితంగా కత్తితో పొడిచారు. ఈ ఘటనలో మయాంక్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కొద్ది సేపటికే మరణించాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ టీవీ పుటేజ్‌ల ఆధారంగా నలుగురు నిందితులు మనీష్, రాహుల్, అశిశ్, సూరజ్‌లను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.