'అతను నా అన్నలాంటోడు'.. కోర్టులో ప్రియుడికి ప్రియురాలు షాక్‌

అతను తనకు అన్నలాంటోడు అంటూ కోర్టులో యువతి ఇచ్చిన స్టేట్‌మెంట్‌ షాక్‌తో ప్రియుడు మణికట్టు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు.

By అంజి  Published on  5 Sept 2023 12:17 PM IST
Kerala high court, lover,Thrissur district, Crime news

'అతను నా అన్నలాంటోడు'.. కోర్టులో ప్రియుడికి ప్రియురాలు షాక్‌

కేరళలో 31 ఏళ్ల వ్యక్తి సోమవారం కేరళ హైకోర్టులో ఆత్మహత్యకు ప్రయత్నించాడు. సదరు వ్యక్తితో నెల రోజుల పాటు సహజీవనం చేసిన యువతి తన తల్లిదండ్రులతో కలిసి వెళ్లాలనుకుంటున్నట్లు కోర్టుకు తెలిపింది. దీంతో ఆ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. త్రిసూర్ జిల్లాకు చెందిన విష్ణు అనే వ్యక్తి జస్టిస్ అను శివరామన్ ఛాంబర్ ముందు మణికట్టు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. విష్ణు, 23 ఏళ్ల యువతి దాదాపు నెల రోజులుగా సహజీవనం చేశారు. అయితే విష్ణు తన కుమార్తెను అక్రమంగా నిర్బంధించాడని ఆరోపిస్తూ మహిళ తండ్రి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై వారు సోమవారం హైకోర్టుకు హాజరయ్యారు.

ఈ క్రమంలోనే యువతి.. తన కుటుంబంతో కలిసి వెళ్లాలనుకుంటున్నట్లు మహిళ న్యాయమూర్తులు అను శివరామన్, సి జయచంద్రన్‌లతో కూడిన డివిజన్ బెంచ్‌కు తెలిపారు. "సోదర వాత్సల్యం" తప్ప విష్ణుతో తనకు రొమాంటిక్ భావాలు లేవని ఆమె కోర్టుకు వాంగ్మూలం ఇచ్చింది. ''అతడు.. నా సోదరుడి లాంటోడు. అతని మీద నాకు ఎలాంటి రొమాంటిక్‌ భావాలు లేవు. నేను వెళ్లిపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. అందుకే అతనితో ఇంతకాలం కలిసి ఉన్నా'' అంటూ కోర్టులో యువతి స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. ఈ స్టేట్‌మెంట్‌తో ప్రియుడికి దిమ్మతిరిగిపోయింది.

ఆ షాక్‌లోనే జడ్జి ఛాంబర్‌లోకి వెళ్లి కత్తితో మణికట్టు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. సోమవారం కేరళ హైకోర్టులో ఈ ఘటన చోటు చేసుకుంది. మహిళ కోర్టుకు సమర్పించిన వివరాల ప్రకారం, విష్ణుకు అప్పటికే మరో మహిళతో వివాహమైందని, అయితే.. సదరు యువతితో రిలేషన్‌షిప్‌లో ఉన్నాడని తెలిశాక భార్య అతన్ని వదిలేసి వెళ్లిపోయింది. యువతి స్టేట్‌మెంట్‌ విన్న విష్ణు జేబులో ఉన్న కత్తిని తీసి అతని మణికట్టును కోసుకున్నాడు. అతడిని పోలీసులు అడ్డుకుని సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించారు.

Next Story