సిగరెట్ కొనుక్కురాలేదని.. 8 ఏళ్ల బాలుడి నుదిటిపై తుపాకీతో కాల్చాడు
బీహార్‌లోని ముంగేర్ జిల్లాలో ఓ వ్యక్తికి సిగరెట్ కొనడానికి నిరాకరించిన ఎనిమిదేళ్ల బాలుడి నుదిటిపై కాల్చాడు.
By అంజి Published on 8 Jan 2025 7:25 AM ISTసిగరెట్ కొనుక్కురాలేదని.. 8 ఏళ్ల బాలుడి నుదిటిపై తుపాకీతో కాల్చాడు
బీహార్‌లోని ముంగేర్ జిల్లాలో ఓ వ్యక్తికి సిగరెట్ కొనడానికి నిరాకరించిన ఎనిమిదేళ్ల బాలుడి నుదిటిపై కాల్చాడు. ఈ సంఘటన ఆదివారం మధ్యాహ్నం గోవింద్‌పూర్ గ్రామంలోని ధరహార పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బాలుడు తన ఇంటి సమీపంలో మంట కాగుతుండగా.. నితీష్ కుమార్ అనే స్థానిక వ్యక్తి బాలుడి దగ్గరకు వచ్చి దుకాణం నుండి సిగరెట్లు తీసుకురావాలని అడిగాడు. చల్లని వాతావరణం కారణంగా బాలుడు సిగరేట్ తీసుకురావడానికి నిరాకరించాడు. దీంతో నితీష్ సంఘటన స్థలం నుండి పారిపోయే ముందు పిస్టల్ తీసి బాలుడి నుదిటిపై కాల్చాడు. కాల్పుల శబ్దం విన్న కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకుని చూడగా రక్తపు మడుగులో పడి ఉన్న బాలుడిని గుర్తించారు. గ్రామస్థుల సహకారంతో ధర్హరా సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడి వైద్యులు మెరుగైన చికిత్స కోసం ముంగేర్ సదర్ ఆస్పత్రికి తరలించారు.
అతని పరిస్థితి విషమంగా ఉండటంతో, తరువాత అతన్ని ఉన్నత వైద్య సదుపాయానికి రెఫర్ చేశారు. ముంగేర్ సదర్ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ అనురాగ్ మాట్లాడుతూ.. బుల్లెట్ బాలుడి నుదుటిపైకి ముక్కుకు చేరిందని తెలిపారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉందని, తక్షణ ప్రత్యేక చికిత్స అవసరమని ఆయన ధృవీకరించారు. సదర్ డీఎస్పీ రాజేష్ కుమార్ సహా పోలీసు అధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించి బుల్లెట్ కేసింగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. గోవింద్‌పూర్ గ్రామానికి చెందిన నితీష్ కుమార్ కాల్పులు జరిపిన అనంతరం పారిపోయాడని డీఎస్పీ కుమార్ తెలిపారు. నిందితుడికి క్రిమినల్ రికార్డ్ ఉందని, ఇప్పటికే మరో కేసులో వాంటెడ్ గా ఉన్నాడని తెలిపారు. అతడిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి జయప్రకాశ్ యాదవ్ ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు, ఇది బీహార్‌లో అన్యాయానికి ఉదాహరణ అని పేర్కొన్నారు. పెరుగుతున్న నేరాల రేటు పరిపాలనా వైఫల్యాన్ని ప్రతిబింబిస్తోందని, రాష్ట్రం "జంగల్ రాజ్"లో ఉందని అభివర్ణించారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేయగా, బాలుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. తదుపరి విచారణలు కొనసాగుతున్నాయి.