కిరాతక తండ్రి.. పక్కా పథకం ప్రకారం.. నీళ్లు ఖాళీ చేసి, ఇంటికి నిప్పంటించి
Man sets son and family on fire in Thodupuzha.ఇటీవల కాలంలో మానవ సంబంధాలు అన్ని ఆర్థిక సంబంధాలుగా
By తోట వంశీ కుమార్ Published on 19 March 2022 1:37 PM ISTఇటీవల కాలంలో మానవ సంబంధాలు అన్ని ఆర్థిక సంబంధాలుగా మారిపోయాయి. ఆస్తి కోసం ఎంతటి దారుణానికైనా తెగబడుతున్నారు. కుటుంబ ఆస్తుల విషయంలో జరిగిన గొడవల కారణంగా ఓ తండ్రి.. తన కుమారుడితో పాటు అతడి కుటుంబాన్ని అంతం చేశాడు. కొడుకు కుటుంబం పడుకున్న రూమ్‌కు బయట నుంచి గడియపెట్టి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. వాళ్లను వాళ్లు కాపాడుకునే అవకాశం కూడా లేకుండా ఇంట్లో ఉన్న నీటి ట్యాంకులోని నీటిని ఖాళీ చేశాడు. ఈ దారుణ ఘటన కేరళ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తొడుపుళలోని చీనికుళి ప్రాంతంలో అబ్దుల్ ఫైసల్(45), భార్య షీబా (45), కుమార్తెలు మెహర్ (16), అఫ్సానా (14)లతో కలిసి నివసిస్తున్నాడు. స్థానికంగా వీరు కిరాణా దుకాణాన్ని నిర్వహించేవారు. కొన్ని కారణాల వల్ల కొద్ది కాలంగా అబ్ధుల్ తండ్రి హమీద్ (79) కూడా వీరితో ఉంటున్నాడు. కొన్నాళ్ల క్రితం తండ్రి హమీద్ 50 సెట్ల భూమిని ఫైసల్ కు ఇచ్చాడు. అయితే.. ఇటీవల కాలంలో తండ్రీ, కుమారుడి మధ్య మనస్పర్థులు రావడంతో తన భూమిని తనకు ఇచ్చేయాలని తండ్రీ అడుగగా.. కుమారుడు ఫైసల్ అందుకు నిరాకరించాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి.
దీంతో కొడుకుపై కోపం పెంచుకున్న హమీద్.. కొడుకు, కోడలు, మనమరాళ్లను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. కొడుకు కుటుంబం ఓ గదిలో నిద్రిస్తుండగా.. పక్కా పథకం ప్రకారం శుక్రవారం అర్థరాత్రి ఇంట్లోని నీటి ట్యాంకులో ఉన్న నీటిని ఖాళీ చేశాడు. తరువాత కుమారుడి కుటుంబం నిద్రిస్తున్న గది బయట నుంచి గడియపెట్టి రూమ్‌పైకి పెట్రోల్ బాటిల్స్‌ను విసిరాడు. అనంతం నిప్పు అంటించి అక్కడినుంచి పరారు అయ్యాడు. మంటలకు మేల్కొన్న పైసల్ కుటుంబం గదిలోకి బయటకు వచ్చే ప్రయత్నం చేసి రాలేక.. బాత్రూమ్‌లోకి వెళ్లారు. అప్పటికే గది నిండా మంటలు వ్యాపించి నలుగురు సజీవదహనం అయ్యారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు హమీద్‌ను అదుపులోకి తీసుకున్నారు.