Kerala: రైలులో దారుణం.. ప్రయాణికులపై పెట్రోల్‌ దాడి.. ముగ్గురు మృతి

కేరళలో దారుణ ఘటన జరిగింది. కోజికోడ్‌ జిల్లా ఎలత్తూర్‌ సమీపంలో ఆదివారం రాత్రి ఎక్స్‌ప్రెస్‌ రైలులో జరిగిన వాగ్వాదం తర్వాత

By అంజి  Published on  3 April 2023 11:33 AM IST
Alappuzha,Kannur district, Kerala, Crime news

Kerala: రైలులో దారుణం.. ప్రయాణికులపై పెట్రోల్‌ దాడి.. ముగ్గురు మృతి

కేరళలో దారుణ ఘటన జరిగింది. కోజికోడ్‌ జిల్లా ఎలత్తూర్‌ సమీపంలో ఆదివారం రాత్రి ఎక్స్‌ప్రెస్‌ రైలులో జరిగిన వాగ్వాదం తర్వాత గుర్తుతెలియని వ్యక్తి పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. రైల్వే వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, రాత్రి 10:00 గంటల ప్రాంతంలో అలప్పుజ - కన్నూర్ మెయిన్ ఎగ్జిక్యూటివ్ ఎక్స్‌ప్రెస్ రైలులోని D1 కంపార్ట్‌మెంట్‌లో ఈ సంఘటన జరిగింది. ఓ ప్రబుద్ధుడు చేసిన పనికి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 8 మంది ఆస్పత్రిలో గాయాలతో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

నిందితుడు నిప్పంటించిన తర్వాత.. ఎమర్జెన్సీ చైన్‌ని లాగిన రైలు వేగం కొద్దిగా తగ్గగానే, రైలు నుంచి దూకి పరారయ్యాడు. ప్రయాణికుల నుంచి సమాచారం అందుకున్న ఆర్పీఎఫ్‌.. వెంటనే మంటలను అదుపు చేశారు. "మట్టన్నూర్‌కు చెందిన రహ్మత్, ఆమె సోదరి రెండేళ్ల కుమార్తె మరియు నౌఫల్ రైల్వే ట్రాక్ దగ్గర చనిపోయి కనిపించారు" అని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) అధికారి తెలిపారు. ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు విచారణ జరుపుతున్నారు.

రైల్వే వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, ఏప్రిల్ 2వ తేదీ రాత్రి 10:00 గంటల సమయంలో అలప్పుజ కన్నూర్ మెయిన్ ఎగ్జిక్యూటివ్ ఎక్స్‌ప్రెస్ రైలులోని డి1 కోచ్‌లో ఈ సంఘటన జరిగింది. ఒక వ్యక్తి తన సహ ప్రయాణీకులలో ఒకరితో వాగ్వాదానికి దిగాడు. ఆ తర్వాత పెట్రోలు పోసి నిప్పంటించాడని సమాచారం. మంటలను ఆర్పేందుకు ప్రయత్నించిన ఇతర ప్రయాణికులు కాలిన గాయాలతో బయటపడ్డారు. గాయపడిన వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారు.

గాయపడిన ప్రయాణికుల్లో తలస్సేరికి చెందిన అనిల్‌కుమార్, అతని భార్య సజిషా, వారి కుమారుడు అద్వైత్, కన్నూర్‌కు చెందిన రూబీ, త్రిసూర్‌కు చెందిన ప్రిన్స్ ఉన్నారు. రైలును ఎలత్తూరులో నిలిపివేసి, ఘటనపై రైల్వే అధికారులకు సమాచారం అందించారు. "కాలిన గాయాలతో ఉన్న ఎనిమిది మంది ప్రయాణీకులను ఆసుపత్రికి తరలించారు. అవసరమైన తనిఖీ తర్వాత, రైలును దాని గమ్యస్థానానికి పంపించారు" అని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) అధికారులు తెలిపారు.

ప్రత్యక్ష సాక్షి తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు ఓ మహిళపై పెట్రోల్‌ పోసి నిప్పించేందుకు ప్రయత్నించాడు. అతను తెల్ల చొక్కా వేసుకొని ఉన్నాడు. అతను రెండు పెట్రోల్‌ బాటిళ్లు తీసుకువచ్చాడని తెలిపారు. కొందరు పెట్రోల్‌ పోసే క్రమంలో కొందరు తప్పించుకునేందుకు రైలు నుంచి దూకేశారు. ఘటన తర్వాత చిన్నారి సహా ముగ్గురు కనిపించకుండా పోయారని, ఆ తర్వాత రైల్వే ట్రాక్‌ వెంట పరిశీలించగా మూడు మృతదేహాలు లభయ్యాయని పేర్కొన్నారు.

Next Story