ఏడు రాష్ట్రాల్లో 14 మందిని పెళ్లి చేసుకున్న 60 ఏళ్ల వ్య‌క్తి అరెస్ట్‌

Man Marries 14 Women In 7 States.ఒక‌రు కాదు ఇద్ద‌రు ఏకంగా 14 మందిని పెళ్లిచేసుకున్నాడు. తానో వైద్యుడిని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 Feb 2022 4:21 AM GMT
ఏడు రాష్ట్రాల్లో 14 మందిని పెళ్లి చేసుకున్న 60 ఏళ్ల వ్య‌క్తి అరెస్ట్‌

ఒక‌రు కాదు ఇద్ద‌రు ఏకంగా 14 మందిని పెళ్లిచేసుకున్నాడు. తానో వైద్యుడిని అని అంద‌రికి చెబుతూ.. ఏడు రాష్ట్రాల్లో 14 మంది మ‌హిళ‌ల‌ను వివాహం చేసుకుని వారి నుంచి డ‌బ్బులు వ‌సూలు చేసిన 60 ఏళ్ల వ్య‌క్తిని భువ‌నేశ్వ‌ర్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. భువనేశ్వర్‌ డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ ఉమాశంకర్‌ దాస్ వెల్ల‌డించిన వివ‌రాల మేర‌కు.. ఒడిశాలోని కేంద్ర పారా జిల్లా పట్కురాకు చెందిన ప్ర‌కాశ్ స్వ‌యిన్ అనే వ్య‌క్తి 1982లో వైద్యుడిని అని న‌మ్మించి ఓ మ‌హిళ‌ను వివాహం చేసుకున్నాడు.

అనంత‌రం 2002లో రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండు పెళ్లిళ్ల కారణంగా ఐదుగురు సంతానం కలిగారు. ఇక 2002 నుంచి 2020 వ‌ర‌కు మ్యాట్రిమోనియ‌ల్ వైబ్‌సైట్లలో మ‌హిళ‌లు ఇచ్చే ప్ర‌క‌ట‌న‌లు చూసేవాడు. మ‌ధ్య వ‌య‌స్సు ఉన్న ఒంట‌రిగా ఉంటున్న మ‌హిళ‌ల‌ను ల‌క్ష్యంగా చేసుకునేవాడు. త‌న పేరు, చిరుమానా మార్చుకుని ఒక‌రికి తెలియ‌కుండా మ‌రొక‌రిని ఇలా 14 మందిని వివాహం చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న త‌రువాత వారి నుంచి పెద్ద మొత్తంలో న‌గ‌దు తీసుకుని పారిపోయేవాడు. చివ‌ర‌గా.. ఢిల్లీలో స్కూల్ టీచ‌ర్‌గా ప‌ని చేస్తున్న ఓ మ‌హిళ‌ను పెళ్లి చేసుకుని భువ‌న్వేశ‌ర్‌లో నివ‌సిస్తున్నాడు.

చివ‌రి భార్య‌కు ఆమె భ‌ర్త పెళ్లిళ్ల బాగోతం తెలియ‌డంతో షాక్‌కు గురైంది. వెంట‌నే పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. పోలీసులు అత‌డిని అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. విచార‌ణ‌లో 14 పెళ్లిళ్లు చేసుకున్న‌ట్లు, వారి నుంచి డ‌బ్బులు తీసుకుని ప‌రారైన‌ట్లు నిందితుడు ఒప్పుకున్న‌ట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి వద్ద నుంచి 11 ఏటీఎం కార్డులు, నాలుగు ఆధార్‌కార్డులు, ఇతర పత్రాలను స్వాధీనం చేసుకున్న‌ట్లు వెల్ల‌డించారు. ఇత‌డి చేతిలో మోస‌పోయినవారిలో ఐదుగురిని గుర్తించారు. మిగిలిన వారిని గుర్తించే ప‌నిలో ఉన్నారు. నిందితుడు గతంలో నిరుద్యోగులకు ఉద్యోగాలిప్పిస్తానని, లోన్ ఫ్రాడ్ తదితర కంప్లైంట్స్ తో హైదరాబాద్, ఎర్నాకులం ప్రాంతాల్లో రెండు సార్లు అరెస్ట్ అయ్యాడ‌ని అన్నారు.

Next Story