చెన్నైలో ఘోరం.. మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటుంద‌ని.. బ‌స్టాండ్‌లోనే మ‌హిళ స‌జీవ‌ద‌హ‌నం

Man kills woman at bus stand.- Burnt alive. త‌మిళ‌నాడులో త‌న‌తో స‌హజీవనం చేస్తున్న మహిళ మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండడాన్ని జీర్ణించుకోలేకపోయిన ఓ వ్యక్తి ఆ మ‌హిళ‌పై పెట్రోలు పోసి నిప్పంటించాడు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 April 2021 6:50 AM GMT
woman killed in Busstand

త‌మిళ‌నాడు రాష్ట్రంలో దారుణం జ‌రిగింది. త‌న‌తో స‌హజీవనం చేస్తున్న మహిళ మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండడాన్ని జీర్ణించుకోలేకపోయిన ఓ వ్యక్తి ఆ మ‌హిళ‌పై పెట్రోలు పోసి నిప్పంటించాడు. వివ‌రాల్లోకి వెళితే.. చెన్నైలో నివ‌సించే ముత్తు అనే వ్య‌క్తి రోజువారి కూలీ. ఇతడు శాంతి అనే మ‌హిళ‌తో స‌హ‌జీవ‌నం చేస్తున్నారు. వారిద్ద‌రు బ‌స్టాండ్ స‌మీపంలోని ఫ్లాట్‌ఫాంపైనే జీవ‌నం చేస్తున్నారు. అయితే.. శాంతి ఇటీవ‌ల కోయంబేడు మార్కెట్‌లో ప‌నిచేసే మ‌రో వ్య‌క్తితో స‌న్నిహితంగా ఉంటోంది. దీనిని గ‌మ‌నించిన ముత్తు.. శాంతి మ‌రో వ్య‌క్తితో క‌లిసి ఉండ‌డాన్ని జీర్ణించుకోలేక‌పోయాడు.

అతడితో సన్నిహితంగా ఉండడం మానుకోవాలని ముత్తు పలుమార్లు శాంతిని హెచ్చరించాడు. అయితే.. అత‌డి మాట‌ల‌ను శాంతి ప‌ట్టించుకోలేదు. దీంతో ప‌లుమార్లు వారిద్ద‌రి మ‌ధ్య.. ఈ విష‌య‌మై గొడ‌వలు జ‌రుగుతున్నాయి. శాంతి ఎంత‌కూ త‌న మాట విన‌క‌పోవ‌డంతో ముత్తు ఆగ్ర‌హించాడు. ఎలాగైన శాంతిని అంత‌మొందించాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. రాత్రి శాంతి నిద్రిస్తున్న స‌మ‌యంలో ఆమెపై పెట్రోల్ పోశాడు. అనంత‌రం నిప్ప‌టించాడు.

అనంత‌రం అత‌డు కూడా ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. అస‌లేం జ‌రుగుతుందో ప్ర‌యాణీకులు గ‌మ‌నించేలోపే ఇద్దరికి మంట‌లు అంటుకున్నాయి. మంట‌ల ధాటికి తాళ‌లేక వారు పెద్ద‌గా అరిచారు. వెంట‌నే అక్క‌డ ఉన్న ప్ర‌యాణీకులు మంట‌ల‌ను ఆర్పివేసి వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. పోలీసుల‌కు సైతం స‌మాచారం ఇచ్చారు. అయితే.. అప్ప‌టికే వారిద్ద‌రు మ‌ర‌ణించిన‌ట్లు డాక్ట‌ర్లు చెప్పారు. కాగా.. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.


Next Story