ప‌రువు తీసింద‌ని.. కోడ‌లిని చంపిన మామ

Man kills his daughter in law.కుటుంబ ప‌రువు తీసింద‌ని కోడ‌లిని మామ దారుణంగా హ‌త‌మార్చాడు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  31 July 2021 8:41 AM IST
ప‌రువు తీసింద‌ని.. కోడ‌లిని చంపిన మామ

కుటుంబం ప‌రువు తీసింద‌ని కోడ‌లిని మామ దారుణంగా హ‌త‌మార్చాడు. ఈ ఘ‌ట‌న తూర్పుగోదావ‌రి జిల్లా మ‌లికిపురం మండ‌లంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల మేర‌కు.. మేడిచ‌ర్ల‌పాలెం గ్రామంలో స‌త్య‌నారాయ‌ణ త‌న కుటుంబంతో క‌లిసి నివ‌సిస్తున్నాడు. కొడుకు విజ‌య్ కుమార్‌కు ఏడేళ్ల క్రితం భార్య సోద‌రుడి కుమారై ప్రియ‌మ‌ణితో వివాహం జ‌రిపించాడు. ఈ దంప‌తుల‌కు ఓ బాబు ఉన్నాడు. ఉపాధి నిమిత్తం విజ‌య్ కుమార్ ఖ‌తార్‌లో ఉంటున్నాడు. ప్రియ‌మ‌ణి త‌ల్లిదండ్రులు అండ‌మాన్‌లో ఉంటున్నారు. కాగా.. అత్త‌మాత‌ల‌తో క‌లిసి ప్రియ‌మ‌ణి మేడిచ‌ర్ల‌పాలెంలో ఉంటోంది.

అయితే.. కొడ‌లి న‌డ‌వ‌డిక స‌రిగాలేద‌ని గ‌త కొద్ది రోజులుగా కుటుంబంలో గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి. ఈ నెల 22న ప్రియ‌మ‌ణి ఓ యువ‌కుడితో వెళ్లిపోయింద‌ని స‌త్య‌నారాయ‌ణ పోలీసుల‌కు పిర్యాదు చేశాడు. వారిని వెతికి తీసుకువ‌చ్చిన పోలీసులు.. ఆమెకు కౌన్సింగ్ ఇచ్చి కుటుంబ స‌భ్యుల‌కు అప్ప‌గించారు. విష‌యం తెలిసిన ప్రియ‌మ‌ణి త‌ల్లి అండ‌మాన్ నుంచి ఇక్క‌డ‌కు వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో మ‌రోసారి కోడ‌లికి మామ‌కు మ‌ధ్య మ‌రోసారి గొడ‌వ జ‌రిగింది. దీంతో ఆవేశానికి లోనైన స‌త్య‌నారాయ‌ణ‌.. కోడ‌లు ప్రియ‌మ‌ణిని ని చాకుతో పొడిచాడు. దీంతో తీవ్ర‌గాయాలైన ప్రియ‌మ‌ణి అక్క‌డిక్క‌డే మృతి చెందింది.

ఆ స‌మ‌యంలో ప్రియ‌మ‌ణి త‌ల్లి అడ్డురాగా.. ఆమెకు స్వ‌ల్ప‌గాయాల‌య్యాయి. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. మృత‌దేహాన్ని ప‌రిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Next Story