ఘోరం.. పెళ్లికి నిరాకరించిందని ప్రియురాలి గొంతుకోసిన ప్రేమోన్మాది
Man killed his girlfriend in Guntur.పెళ్లికి నిరాకరించిందని ఓ ప్రేమోన్మాది యువతి
By తోట వంశీ కుమార్ Published on 6 Dec 2022 8:26 AM ISTగుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లికి నిరాకరించిందని ఓ ప్రేమోన్మాది యువతి గొంతుకోసి హతమార్చాడు. ఈ ఘటన సోమవారం రాత్రి పెదకాకాని మండలం తక్కెళ్లపాడులో జరిగింది.
కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన తపస్వి(21) విజయవాడలోని ఓ మెడికల్ కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ డెంటర్ సర్జరీ(బీడీఎస్) మూడో సంవత్సరం చదువుతోంది. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం మానికొండకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ జ్ఞానేశ్వర్‌తో రెండు సంవత్సరాల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. కొంతకాలం ప్రేమించుకున్నారు. అయితే.. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో తపస్వి అతడిపై కృష్ణా జిల్లాలో పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ అతడి నుంచి ఇబ్బందులు ఎదురు అవుతుండడంతో తక్కెలపాడులో ఉంటున్న తన స్నేహితురాలికి చెప్పి బాధపడింది. ఆమె ధైర్యం చెప్పింది.
అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు స్నేహితురాలు ఇద్దరిని తన ఇంటికి పిలిపించి మాట్లాడుతుండగా.. ఆగ్రహంతో ఊగిపోయిన జ్ఞానేశ్వర్ జేబులోంచి సర్జికల్ బ్లేడు తీసి తపస్విపై దాడికి తెగబడ్డాడు. భయంతో స్నేహితురాలు భయటకు పరుగులు తీసి స్థానికులకు విషయం చెప్పింది. వారు వచ్చేసరికే లోపలి నుంచి గడియ పెట్టిన జ్ఞానేశ్వర్ తన చేతిపై కోసుకున్నాడు. తలుపులు బద్దలు కొట్టిన గ్రామస్తులు కొన ఊపిరితో ఉన్న బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన తపస్వి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. జ్ఞానేశ్వర్‌ను అదుపులోకి తీసుకున్నారు. తాను వేరే యువకుడిని పెళ్లి చేసుకుంటానని మాటల సందర్భంలో చెప్పడంతోనే జ్ఞానేశ్వర్ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.