విజయవాడలోని పోక్సో కేసుల ప్రత్యేక కోర్టు సోమవారం సంచలన తీర్పు వెలువరించింది. మైనర్ బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తికి జీవిత ఖైదు (మరణించే వరకు జైలు శిక్ష) విధించింది. అలాగే బాధితు కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం అందించాలని న్యాయమూర్తి డాక్టర్ ఎస్ రజనీ జిల్లా న్యాయ సేవల అధికార సంస్థ (డీఎల్‌ఎస్‌ఏ)ని ఆదేశించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 26న పాఠశాల నుంచి వచ్చి ఇంట్లో ఉన్న ఏడేళ్ల బాలికపై అనిల్ (30) అనే నిందితుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు.
ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సమీపంలోని నున్నలో జరిగింది. బాధితురాలి ఇంటి సమీపంలో నివసించే అనిల్ నెమలి ఈకలు ఇస్తానంటూ బాలికను తాను పని చేస్తున్న టెంట్‌హౌస్‌కు రప్పించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనిల్ తనపై అత్యాచారం చేశాడని బాలిక తల్లికి చెప్పడంతో నున్న పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి దిశ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. నిందితుడిని అరెస్టు చేసి నేరం రుజువు కావడంతో నిందితుడికి జీవిత ఖైదు, రూ.3 వేలు జరిమానా విధించారు.