కన్యత్వ పరీక్షలో విఫలమైందని.. అక్కాచెల్లెళ్లకు విడాకులు
Man divorces wife for failing virginity test.కన్యత్వ పరీక్షలో విఫలమైందని.. అక్కాచెల్లెళ్లకు విడాకులు
By తోట వంశీ కుమార్ Published on 10 April 2021 9:36 AM GMTసైన్స్ ఇంతగా అభివృద్ది చెందిన ఈ రోజుల్లో కూడా కొందరు ఇంకా మూఢనమ్మకాలు, అంధ విశ్వాసాలు నమ్మడం ఆపడం లేదు. తాజాగా కన్యత్వ (శీల) పరీక్షల్లో విఫలమైందని నవ వధువును పుట్టింటికి పంపించాడో భర్త. ఆమెతో పాటు ఆమె చెల్లిని కూడా పుట్టింటికి పంపించారు. ఈ ఘటన మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో జరిగింది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కొల్హాపూర్‌లో నివాసం ఉంటే.. కంజర్భట్ తెగకు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లకు అదే గ్రామానికి చెందిన అన్నాతమ్ముళ్లతో గతేడాది నవంబర్ 27న పెళ్లి జరిపించారు. వారి ఆచారం ప్రకారం.. పెళ్లైన వెంటనే భార్యకు కన్యత్వ పరీక్షలు పెడుతారు.
ఇందులో భాగంగా ఇద్దరు అక్కాచెల్లెళ్లకు కన్యత్వ పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఓ మహిళ విఫలమైంది. దీంతో అప్పటి నుంచి అత్తింటివారు వారిని వేదించడం మొదలుపెట్టారు. ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లను పుట్టింటికి పంపించారు. దీనిపై ఆ అమ్మాయిల తల్లిదండ్రులు పంచాయతీని ఆశ్రయించారు. అక్కడ తమకు న్యాయం జరుగుతుందని భావించారు. అయితే.. కన్యత్వ పరీక్షలో యువతి విఫలమైందని, దీంతో ఆమెకు ఇదివరకే ఎవరితోనో సంబంధం ఉందని పంచాయతీ పెద్దలు ఆరోపించారు. అంతేకాదు ఆ కుటుంబాన్ని కులం నుంచి వెలివేస్తున్నామని తీర్పు చెప్పారు. ఆపై ఆ ఇద్దరికీ భర్తల నుంచి విడాకులు ఇస్తున్నట్టు కులపెద్దలు తీర్పుఇచ్చారు. కులపెద్దలు ఇచ్చిన షాకింగ్ తీర్పుతో అమ్మాయి తల్లిదండ్రులు మరింత నిర్ధాంతపోయారు. చేసేదేమీ లేక.. పోలీసులను ఆశ్రయించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.