హైదరాబాద్‌లో ఒక వ్యక్తి తాను తీసుకున్న అప్పు తిరిగి చెల్లించాలంటూ ఫైనాన్స్ కంపెనీకి చెందిన వ్యక్తులు వేధించడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తనకు ఎదురైన కష్టాలను వీడియో తీసి ఆ వ్యక్తి ప్రాణాలు తీసుకున్నాడు. మృతుడు మహ్మద్ నిజాముద్దీన్‌గా గుర్తించబడిన ఆటో డ్రైవర్, అతనికి ఆరు నెలలుగా ఉద్యోగం లేదు. గత రెండు నెలలుగా ఈఎంఐ చెల్లించలేకపోయాడు. అతను నిరుద్యోగిగా ఉన్నప్పటి నుండి తీవ్రమైన ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నాడు. అతను ఒక ఫైనాన్స్ కంపెనీ నుండి ఈఎంఐ ద్వారా రెండు ఫోన్‌లను కొనుగోలు చేశాడు. ఈఎంఐలను చెల్లిస్తూ వచ్చాడు. కానీ అతను డబ్బులు లేకపోవడంతో చివరిసారిగా కట్టాల్సిన రూ.4,000 కట్టలేకపోయాడు.
ఈ మొత్తాన్ని చెల్లించడంలో నిజాముద్దీన్ ఇబ్బందులు పడ్డాడు. అయితే డబ్బులు కట్టాలంటూ ఫైనాన్స్ కంపెనీ వ్యక్తులు నిజాముద్దీన్ ఇంటికి వచ్చి వేధింపులకు గురిచేశారు. దీంతో అవమానం తట్టుకోలేని నిజాముద్దీన్.. ఫైనాన్స్ కంపెనీ వేధింపులు భరించలేక వీడియో రికార్డ్ చేశాడు. తన చావుకు ఫైనాన్స్ కంపెనీ వేధింపులే కారణమంటూ ప్రాణాలు తీసుకున్నాడు. సెల్ఫీ వీడియో సాక్ష్యంగా, మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కుల్సుంపురా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. తదుపరి విచారణలు జరుగుతున్నాయి.