మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నగరంలో కారు హెడ్‌లైట్ గురించి జరిగిన గొడవలో ఓ వ్యక్తి ప్రాణం కోల్పొవాల్సి వచ్చింది. హైడ్‌లైట్ గురించి జరిగిన వాదనలో స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (ఎస్‌ఆర్‌పిఎఫ్) జవాన్ చెంపదెబ్బ కొట్టడంతో 54 ఏళ్ల వ్యక్తి మరణించాడని ఆదివారం ఒక అధికారి తెలిపారు. నిందితుడు నిఖిల్ గుప్తా (30) తన సోదరిని చూసేందుకు వథోడా పోలీస్ స్టేషన్ పరిధిలోని మాతా మందిర్ ప్రాంతంలో గురువారం రాత్రి అక్కడికి చేరుకున్నాడు. గుప్తా తన కారును పార్క్ చేస్తున్నప్పుడు, వాహనం యొక్క హెడ్‌లైట్ బీమ్ అదే ప్రాంతంలో నివసించే బాధితుడు మురళీధర్ రామ్‌రాజీ నెవేర్ ముఖాన్ని తాకినట్లు అధికారి తెలిపారు.
హెడ్‌లైట్‌ని డౌన్ చేయమని నిఖిల్ గుప్తాకు నెవేర్ మర్యాదపూర్వకంగా చెప్పాడు. కానీ ఎస్‌ఆర్‌పీఎఫ్ జవాన్ కోపంగా ఉన్నాడు. అతడి మాట వినలేదు. చివరకు ఇది ఇద్దరి మధ్య వాగ్వాదానికి దారితీసింది. గుప్తా అతనిని గట్టిగా కొట్టడంతో నెవేర్ నేలమీద కుప్పకూలిపోయాడు. అతడిని ప్రభుత్వ వైద్య కళాశాల అండ్ ఆసుపత్రికి తరలించగా, శనివారం మరణించినట్లు అధికారి తెలిపారు. పోలీసులు గుప్తాపై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 304 కింద కేసు నమోదు చేసినట్లు అధికారి తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.