ప్రాణం తీసిన రూ.50 అప్పు.. ఏమైందంటే?
Man Deceased Sattenapalli Over Money Issue.రూ.50 అప్పు ఒకరి ప్రాణాలు పోవడానికి కారణం అయింది .
By Medi Samrat Published on 22 Jan 2021 11:26 AM ISTతాజాగా వచ్చిన రవితేజ క్రాక్ సినిమాలో కేవలం 50 రూపాయలు వల్ల జైలుకి వెళ్తాడు ముంబై మాఫియా డాన్. ఈ సీను అందరికీ బాగా గుర్తుండే ఉంటుంది. సినిమాలో 50 రూపాయలు ఒక వ్యక్తిని జైలుపాలు చేస్తే.. నిజజీవితంలో అదే 50 రూపాయలు ఓ వ్యక్తి ప్రాణాలని తీసింది. కేవలం యాభై రూపాయల అప్పు కోసం జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి నిండు ప్రాణాలను కోల్పోయిన ఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు...
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో పాత బస్టాండ్ ప్రాంతానికి చెందిన షేక్ బాజీ (27) ఆటోనగర్ ప్రభుత్వ మద్యం దుకాణంలో సేల్స్ మెన్ గా పని చేస్తున్నాడు. అనంతరం రాత్రిపూట శ్రీ లక్ష్మీ మారుతి పాల దుకాణంలో పని చేస్తూ జీవనం సాగించేవాడు.అయితే పదిహేను రోజుల కిందట ఈ పాల దుకాణం దగ్గరకు అదే ప్రాంతానికి చెందిన పల్లపు కోటి వీరయ్య ఒక సిగరెట్ ప్యాకెట్, వాటర్ బాటిల్ తీసుకొని అందుకు అయిన 50 రూపాయలను ఫోన్ పే చేశాడు. అయితే నగదు దుకాణదారుని ఖాతాలో పడకుండా ప్రాసెస్ లో ఉందని చెప్పి ఒకవేళ డబ్బు జమ కాకపోతే పొద్దున్నే ఇస్తానని అక్కడినుంచి వెళ్ళాడు.
కోటి వీరయ్య పంపిన నగదు రాకపోవడంతో నాలుగు రోజుల క్రితం వీరయ్య తమ్ముడు నాగేశ్వరరావు దుకాణం దగ్గరకు వెళ్లగా అతనిని 50 రూపాయలు ఇవ్వమని అక్కడ పనిచేసే బాజీ అడిగాడు. మంగళవారం కూడా కోటి వీరయ్య తమ్ముని డబ్బులు అడగడంతో అతను కోపంగా 50 రూపాయలు ఇచ్చి ఇంటికి వెళ్ళాడు. విషయం తెలుసుకున్న కోటి వీరయ్య డబ్బులు ఇవ్వాల్సింది నేనైతే నా తమ్ముడుని ఎందుకు అడిగారని దుకాణ యజమాని వాసుతో గొడవ పడ్డాడు. ఇందులో బాజీ కలగజేసుకుని యజమానిని దుకాణం లోపలికి పంపించి వీరయ్య, నాగేశ్వరరావు, అతనితోపాటు వెళ్ళిన తిరుమల్లేశ్వరరావులను పక్కకు తీసుకెళ్లి మాట్లాడుతున్న క్రమంలో వీరి మధ్య ఘర్షణ పెరిగి అందరూ కలిసి బాజీని కొట్టారు.
ఒక్కసారిగా బాజీ స్పృహ తప్పి పడిపోవడంతో చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలకు తరలించగా బుధవారం రాత్రి చికిత్సపొందుతూ బాజీ మరణించడంతో తన భార్య సైదాబీ కోటి వీరయ్య, తిరుమల్లేశ్వరరావు, వాసు, నాగేశ్వరరావు తదితరులు పై ఫిర్యాదు చేయడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. బాజీ మరణం వల్ల తను తన ఇద్దరు కొడుకులు అనాధలుగా మిగిలిపోయారని తన భార్య రోదించడం పలువురిని కంటతడి పెట్టించింది.