ఆదుకున్న స్నేహితుడినే హత్య చేసి పాతిపెట్టారు.. మృతుడితోనే గుంతను తవ్వించి
Man brutally killed by his friends in Patancheru.స్నేహితుడు కష్టాల్లో ఉన్నాడని తెలిసి నగదును అప్పుగా ఇప్పించాడు.
By తోట వంశీ కుమార్ Published on 14 Sept 2022 7:32 AM ISTస్నేహితుడు కష్టాల్లో ఉన్నాడని తెలిసి నగదును అప్పుగా ఇప్పించాడు. ఎన్ని రోజులైనా సరే డబ్బులు ఇవ్వకపోవడంతో కాస్త గట్టిగా అడిగాడు. అంతే.. తీసుకున్న అప్పు చెల్లించకపోగా సాయం చేసిన స్నేహితుడినే హత్య చేసిన ఘటన సంగారెడ్డి జిల్లాలోని పటాన్ చెరులో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. మహ్మద్ సమీర్ అహ్మద్(28) గౌతంనగర్ కాలనీలో తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. ఇతడికి భానూరు మటన్ షాపులో పని చేస్తున్న షేక్ ఇలియాస్, అతడి సహాకుడు రుస్తుం అలీ, మియాపూర్‌లో అడ్డాకూలీగా పనిచేస్తున్న అల్లావుద్దీన్ లు స్నేహితులు. కాగా.. ఇలియాస్ ఇబ్బందుల్లో ఉన్నాడని సమీర్ తన తండ్రికి చెప్పాడు. తమ ఇంట్లో ఉంటున్న మాణిక్ రెడ్డి వద్ద నుంచి రూ.50 వేలు ఇప్పించాడు. మూడు నెలల్లో ఇస్తానని చెప్పిన ఇలియాస్ ఎన్ని రోజులైనా డబ్బులు ఇవ్వలేదు.
దీంతో సమీర్.. పలువురి ముందు ఇలియాస్‌ను గట్టిగా అడిగాడు. దీన్ని ఇలియాస్ అవమానంగా బావించాడు. సమీర్‌ను హత్య చేయాలని పథకం పన్నాడు. ఇందుకు రుస్తుం అలీ, అల్లావుద్దీన్‌ల సాయం కోరాడు. ఓ వ్యక్తి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించాలంటూ ఈ నెల 8న పటాన్ చెరు శివారులో కూలీలతో గుంత తవ్వించాడు. సమీర్ కు ఇదే విషయాన్ని చెప్పి అక్కడకు తీసుకువెళ్లారు. సమీర్ చేత గుంతను పెద్దగా తవ్వించారు.
మరుసటి రోజు ఉదయం సమీర్‌కు ఫోన్ చేసిన ఇలియాస్.. నిన్న మృతదేహం రాలేదని, గుంతను పూడ్చేద్దామని కోరడంతో సమీర్ అక్కడకు వెళ్లాడు. అల్లావుద్దీన్ గుంతను పూడుస్తున్నట్లుగా నటిస్తూ సమీర్ తలపై ఇనుపరాడ్డుతో కొట్టాడు. గుంతలో పడిపోయిన సమీర్‌పై ఇలియాస్ నాలుగు గ్రానైట్ రాళ్లను పడేశారు. అనంతరం రుస్తుం అలీతో కలిసి మట్టిపోసి పూడ్చేశారు.
సమీర్ ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన అతడి తండ్రి.. ఇలియాస్‌ను అడుగగా పొంతన లేని సమాధానాలు చెప్పాడు. దీంతో సమీర్ తండ్రి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇలియాస్, రుస్తుం అలీలను అదుపులోకి తీసుకోగా.. అల్లావుద్దీన్ పరారీలో ఉన్నాడు. అతడి కోసం గాలింపు చేపట్టారు.