సికింద్రాబాద్ నుండి మేడ్చల్ వెళుతున్న ఎంఎంటీఎస్ రైలులో యువతిపై ఓ వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. దీంతో ఆ యువతి అతడి నుండి తప్పించుకోడానికి రైలు నుండి కిందకు దూకింది. తీవ్ర గాయాలతో గుడ్ల పోచంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో పడి పోయింది. అదిచూసిన పాదచారుడు వెంటనే 108కు సమాచారం ఇచ్చాడు. ఆ తర్వాత అంబులెన్స్‌లో బాధితురాలిని గాంధీ హాస్పిటల్ కు తరలించారు. బాధితురాలిది అనంతపూర్‌లోని ఉరవకొండ అని పోలీసులు తెలిపారు. సదరు యువతి మేడ్చల్‌లోని వర్కింగ్ విమెన్స్ హాస్టల్ లో ఉంటూ స్విగ్గీలో పని చేస్తోంది.
సికింద్రాబాద్‌లో తన సెల్ ఫోన్ రిపేర్ చేసుకొని ఎంఎంటీఎస్ రైలులో తిరిగి వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. రాత్రి 8.30గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. మహిళల బోగిలోకి ప్రవేశించిన అగంతకుడు ఒంటరిగా ఉన్న తనపై అత్యాచారయత్నం చేసినట్లు ఆమె పోలీసుల ఎదుట వెల్లడించింది. యువకుడు చెక్స్ చొక్క ధరించి నల్లగా, సన్నగా ఉన్నాడని సుమారు 25ఏళ్ల వయసు ఉంటుందని యువతి తెలిపింది. సికింద్రాబాద్ జీఆర్పీ ఇన్ స్పెక్టర్ సాయి ఈశ్వర్ గౌడ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.