హైద‌రాబాద్‌లో ప్రేమోన్మాది ఘాతుకం.. దూరం పెట్టింద‌ని యువ‌తిపై దాడి

Man attacked Woman with knife in Hyderabad. తాజాగా ప్రేమించిన యువ‌తి కొద్ది కాలంగా ప‌ట్టించుకోక‌పోవ‌డంతో ప్రేమోన్మాది ఆమెపై క‌త్తితో దాడికి పాల్ప‌డ్డాడు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 March 2021 5:28 AM GMT
Man attacked Woman with knife in Hyderabad

ఎన్ని క‌ఠిన చ‌ట్టాలు తెచ్చిన‌ప్ప‌టికి మ‌హిళ‌ల‌పై దాడులు ఆగ‌డం లేదు. త‌న‌ను ప్రేమించ‌డం లేద‌ని ఒక‌రు, అనుమానంతో మ‌రొక‌రు మ‌హిళ‌ల‌పై దాడుల‌కు పాల్ప‌డుతూనే ఉన్నారు. తాజాగా ప్రేమించిన యువ‌తి కొద్ది కాలంగా ప‌ట్టించుకోక‌పోవ‌డంతో ప్రేమోన్మాది ఆమెపై క‌త్తితో దాడికి పాల్ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న గండిపేట‌ మండలం హైదర్షాకోట్ ప్రాంతంలో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. నార్సింగి పోలీసులు తెలిపిన వివ‌రాల మేర‌కు.. హైదర్షాకోట్‌కు చెందిన 29 ఏళ్ల యువతి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ప‌నిచేస్తోంది. ఆమెకు ఓ ఇంట‌ర్‌నేష‌న‌ల్ సెలూన్‌లో ప‌నిచేసే హ‌ర్యానాకు చెందిన షారూఖ్ స‌ల్మాన్‌(29)తో ప‌రిచ‌యం ఏర్పడింది. ఆ పరిచ‌యం ప్రేమ‌గా మారింది.

వారిద్ద‌రూ త‌ర‌చుగా క‌లుసుకునేవార‌ని.. అప్పుడ‌ప్పుడూ స‌ల్మాన్ యువ‌తి ఇంటికి కూడా వ‌చ్చేవాడ‌న్నారు. ఏమైందో తెలియ‌దు గానీ.. ఇటీవ‌ల ఆ యువ‌తి స‌ల్మాన్‌ను దూరం పెడుతూ వ‌చ్చింది. ఈ క్ర‌మంలో ఆ యువ‌తికి పెళ్లి నిశ్చ‌య‌మైంది. మేలో పెళ్లి ముహూర్తం. ఈ విషయం తెలుసుకున్న షారుఖ్ సల్మాన్‌లో ఆగ్ర‌హాం క‌ట్టలు తెంచుకుంది. దీంతో అత‌డు మంగ‌ళ‌వారం రాత్రి 7.30స‌మ‌యంలో యువ‌తి ప్లాట్‌కు వెళ్లి క‌త్తితో దాడి చేశాడు. కుటుంబ స‌భ్యుల అరుపుల‌తో అప్ర‌మ‌త్త‌మైన స్థానికులు పారిపోతున్న స‌ల్మాన్‌ని ప‌ట్టుకుని పోలీసుల‌కు అప్ప‌గించారు.

గాయ‌ప‌డిన యువ‌తిని లంగ‌ర్‌హౌజ్‌లోని ప్రైవేటు ఆస్ప‌త్రిలో చేర్పించారు. యువ‌తి వీపు భాగంలో రెండు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె శరీరంపై మరో రెండు చిన్న గాయాలు అయిన‌ట్లు వైద్యులు వెల్ల‌డించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. కాగా.. యువ‌తిపై దాడికి పాల్ప‌డ్డ స‌ల్మాన్‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.


Next Story
Share it