హనుమకొండలో ప్రేమోన్మాది ఘాతుకం.. ఎంసీఏ విద్యార్థిని గొంతు కోసి
Man attack on woman with knife in Hanumakonda.తనను ప్రేమించడం లేదని ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు.
By తోట వంశీ కుమార్ Published on 22 April 2022 1:12 PM ISTతనను ప్రేమించడం లేదని ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో యువతిపై కత్తితో దాడి చేసి గొంతు కోశాడు. ఈ ఘటన హనుమకొండలోని సుబేదారి పోలీసు స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. నర్సంపేట పరిధిలోని లక్నెపల్లి గ్రామానికి చెందిన అనూష(23) కాకతీయ యూనివర్సిటీలో ఎంసీఏ ఆఖరి సంవత్సరం చదువుతోంది. ఆమె చదువు నిమిత్తం అనూషతో పాటు ఆమె కుటుంబ సభ్యులు పోచమ్మ గుడి సమీపంలోని గాంధీ నగర్‌లో నివాసముంటున్నారు. అయితే.. అజహర్ అనే యువకుడు గత కొంతకాలంగా ప్రేమ పేరుతో అనూష వెంటపడుతున్నాడు. అనూష అతడి ప్రతిపాదనను తిరస్కరిస్తూ వస్తోంది. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్న అజహర్ శుక్రవారం ఉదయం అనూష ఇంట్లో ఒక్కతే ఉన్నట్లు నిర్థారించుకుని ఆమె ఇంటిలోపలికి వెళ్లాడు.
తనను ప్రేమించాలని మరోసారి అనూషను కోరాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఆగ్రహంతో ఊగిపోయిన అజహర్ తన వెంట తెచ్చుకున్న కత్తితో యువతి గొంతుకోసి హత్య చేసేందుకు యత్నించాడు. యువతి కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారు అయ్యాడు. అప్పుడే ఇంటికి వచ్చిన తల్లి.. ఆ ఘటనను చూసి షాకైంది. కుమారై అనూషను స్థానికుల సాయంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించింది. వైద్యులు అనూషకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అనూష పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.